Share News

మహారాష్ట్ర ప్రగతి పథాన్ని ఎన్నుకుంది

ABN , Publish Date - Nov 24 , 2024 | 03:52 AM

మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు.

మహారాష్ట్ర ప్రగతి పథాన్ని ఎన్నుకుంది

మహాయుతి విజయంపై పవన్‌ హర్షం

ఏపీ డిప్యూటీ సీఎం ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయం

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమికి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. ఈ ఘన విజయం ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో ఆయన పోస్టు చేశారు. మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం గర్వకారణమని తెలిపారు. మహారాష్ట్రలోని తెలుగువారి అభివృద్ధి, సంక్షేమం కోసం కొత్త ప్రభుత్వం కృషి చేయాలని, మహారాష్ట్ర-ఏపీ మధ్య పరస్పర సహకారాన్ని కొనసాగించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

వంద శాతం స్టైక్‌రేట్‌

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి మద్దతుగా ప్రచారం చేసిన అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. డేగ్లూర్‌, భోకర్‌, లాతూర్‌, షోలాపూర్‌ నగరంలోని మూడుస్థానాలు, బల్లార్‌పూర్‌, చంద్రాపూర్‌, పుణె కంటోన్మెంట్‌, హడ్సర్‌పూర్‌, కస్బాపేట్‌ నియోజకవర్గాల్లోని మహాయుతి అభ్యర్థులను గెలిపించాలని పవన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో అన్నింటా విజయం దక్కడంతో మరోసారి 100 శాతం స్ర్టైక్‌రేట్‌ అందుకున్నారు. లాతూర్‌ సిటీ, డేగ్లూర్‌ అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ తొలిసారి విజయం సాధించడం గమనార్హం.

Updated Date - Nov 24 , 2024 | 03:52 AM