PM Modi: మహిళలపై నేరాలు.. క్షమించరాని పాపాలు
ABN , Publish Date - Aug 26 , 2024 | 05:04 AM
మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిపై హత్యాచారం,
దోషులను వదిలే ప్రసక్తే లేదు.. ఈ సందేశం పై నుంచి కింది వరకు వెళ్లాలి
ప్రభుత్వాలు వస్తాయి పోతాయి.. కానీ మహిళల రక్షణ అందరి బాధ్యత
స్వయం సహాయక బృందాలకు రూ.9 లక్షల కోట్లు సాయం చేశాం
రాజకీయ నేపథ్యం లేని యువత రాజకీయాల్లోకి రావాలి
‘మన్ కీ బాత్’, ‘లఖ్‌పతి దీదీ’ కార్యక్రమాల్లో ప్రధాని
తెలుగు భాష అద్భుతం.. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మహిళలపై జరుగుతున్న నేరాలు క్షమించరాని పాపాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిపై హత్యాచారం, ముంబై సమీపాన బద్లాపూర్‌లో నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల ఉదంతాల నేపథ్యంలో ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్‌లో జరిగిన ‘లఖ్‌పతి దీదీ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు. అలాగే ఆకాశవాణిలో ‘మన్ కీ బాత్’ 113వ సంచికలోనూ ప్రసంగించారు.
‘దేశంలో తల్లులు, అక్కచెల్లెళ్ల రక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలి. నా ఎర్రకోట ప్రసంగంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాను. మహిళలపై నేరాలు క్షమించరాని పాపాలని ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి చెబుతున్నాను. దోషులెవరైనా వదిలిపెట్టవద్దు. ఈ నేరాలను ప్రోత్సహించే వారిని కూడా విడిచిపెట్టకూడదు. ఈ సందేశం పై నుంచి కిందిస్థాయి వరకు వెళ్లాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మహిళల జీవితాలు, గౌరవాన్ని కాపాడడం సమాజం, ప్రభుత్వం సహా మనందరిపై ఉన్న అతి పెద్ద బాధ్యత’ అని స్పష్టం చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల కంటే గత పదేళ్లలో తన ప్రభుత్వం మహిళల కోసం ఎంతో చేసిందన్నారు. 2014 వరకు స్వయం సహాయక సంఘాలకు కేవలం రూ.25 వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారని, గత దశాబ్ద కాలంలో తన ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. జల్గావ్‌లో లక్షాధికారి సోదరీమణుల(లఖ్‌పతి దీదీ)తో ఆయన సంభాషించారు. 4.3 లక్షల సంఘాలకు చెందిన 48 లక్షల మంది సభ్యులకు రూ.2,500 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను విడుదల చేశారు. ‘లఖ్‌పతి దీదీ స్కీం కేవలం మహిళల ఆర్థికాభివృద్ధికి మాత్రమే సంబంధించింది కాదు.
ఇది భావితరాల సాధికారతకు సంబంధించింది. గత పదేళ్లలో కోటి మంది లక్షాధికారిణులను తయారుచేశాం. గత రెండు నెలల్లోనే 11 లక్షల మంది లక్షాధికారిణులు ఆవిర్భవించారు. త్వరలో మన దేశం మూడో అతిపెద్ద ఎకానమీగా అవతరించనుందని మీరు వినే ఉంటారు. ఇందులో మహిళలదే అతిపెద్ద పాత్ర. అందుకే మీ కొడుకుగా, సోదరుడిగా మీ జీవితాలను సుఖమయం చేయాలని సంకల్పించాను. ఏటికేడాదీ మీ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాం. కేంద్రం 3 కోట్ల కొత్త ఇళ్లు నిర్మించనుంది. అవన్నీ మహిళలకే కేటాయిస్తాం’ అని మోదీ వివరించారు.
సమష్టి కృషితో రాజకీయంగా ఎదగాలి
రాజకీయ నేపథ్యం లేని యువత సమష్టి కృషితో రాజకీయాల్లో ఎదగాలని మోదీ ఆకాంక్షించారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఇలాంటివారే ఎదిగారని.. వారి స్ఫూర్తితో ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు ఉపక్రమించాలని ‘మన్ కీ బాత్’లో పిలుపిచ్చారు. ‘కుటుంబ రాజకీయాలు కొత్త టాలెంట్‌ను అణగదొక్కుతున్నాయని కొందరు యువత నాకు తెలియజేశారు. చాలా మంది రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. సరైన అవకాశం, మార్గనిర్దేశం కోసం వారు ఎదురుచూస్తున్నారు. తమకు ఆసక్తి ఉన్నప్పటికీ.. తాత తండ్రుల నుంచి రాజకీయ వారసత్వం లేనందున రాలేకపోతున్నామని పలువురు లేఖల్లో తెలిపారు.
వీరంతా సమష్టి కృషితో కచ్చితంగా రాజకీయాల్లో రాణించగలరు’ అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఐఐటీ-మద్రా్‌సలో చదివి.. ‘గెలాక్స్‌ఐ’ అంతరిక్ష స్టార్టప్ ఏర్పాటు చేసిన యువ పారిశ్రామికవేత్తలతో ఆయన సంభాషించారు. హూలాక్ గిబ్బన్స్ (వానర జాతి)తో అసోంలోని బరేకురి గ్రామానికి చెందిన మోరన్ తెగవారికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘గిబ్బన్స్‌కు అరటిపండ్లు అంటే ఇష్టమని వారు తమ చేలో అరటి సాగు చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులు పుట్టినా, చనిపోయినా నిర్వహించే కార్యక్రమాలను ఈ వానరాల విషయంలోనూ చేస్తున్నారు. వాటికి పేర్లు కూడా పెడుతున్నారు. ఇటీవల... కనిపించని విద్యుత్ తీగల కారణంగా ఈ కోతులు ఇబ్బందిపడ్డాయి. ఈ విషయాన్ని గ్రామస్థులు ప్రభుత్వానికి తెలియజేయడంతో సత్వరమే ఆ సమస్యను పరిష్కరించాం’’ అని మోదీ చెప్పారు.
కోల్‌కతా ఘటనపై ‘బార్’ తీర్మానం పేలవం
కోల్‌కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టరుపై జరిగిన అత్యాచారం, హత్య సంఘటనను తక్కువగా చూపించే ప్రయత్నం చేశారంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్‌పై మాజీ అధ్యక్షుడు ఆదిశ్ అగర్వాలా విమర్శలు చేశారు. ఆ సంఘటనను ఖండిస్తూ సిబల్ పేరున విడుదలైన బార్ తీర్మానాన్ని వెంటనే ఉపసంహరించుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, లేకుంటే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అసలు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకోకుండానే తీర్మానాన్ని ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. ఆ తీర్మానం చెల్లదని తెలిపారు.
తెలుగు భాష అద్భుతం
తెలుగు అద్భుతమైన భాష అని మోదీ ‘మన్ కీ బాత్’లో కొనియాడారు. ఈ నెల 29న తెలుగు భాషా దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రపంచంలోని తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 19న రక్షాబంధన్‌తో పాటు ‘ప్రపంచ సంస్కృత దినోత్సవం’ కూడా జరుపుకున్నామని మోదీ గుర్తు చేశారు. విదేశాల్లోనూ సంస్కృతంపై అధ్యయనాలు జరుగుతున్నాయని చెప్పారు.