Share News

Kuwait: కువైట్ అగ్ని ప్రమాదంపై మోదీ సమీక్ష.. మృతదేహాలను తీసుకురావాలని ఆదేశం

ABN , Publish Date - Jun 13 , 2024 | 07:55 AM

కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) 50 మందికి పైగా భారతీయులు మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు.

Kuwait: కువైట్ అగ్ని ప్రమాదంపై మోదీ సమీక్ష.. మృతదేహాలను తీసుకురావాలని ఆదేశం

కువైట్: కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో(Kuwait Fire Accident) 50 మందికి పైగా భారతీయులు మృతి, 40 మందికి పైగా గాయపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) బుధవారం అర్ధరాత్రి సమీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో ఈ సమావేశం జరిగింది.

విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా, ఇతర సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై మోదీ సంతాపం తెలిపారు.


మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని మోదీ అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షించడానికి, మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి రప్పించడానికి తక్షణమే కువైట్ వెళ్లాలని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్‌ను ఆయన కోరారు.

"ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేయడానికి, దురదృష్టకర ఘటనలో మరణించిన వారి మృతదేహాలను స్వదేశానికి రప్పించడానికి కీర్తివర్ధన్ సింగ్ కువైట్‌కు వెళుతున్నారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ X లో పోస్ట్ చేశారు.


ఘటన జరిగిందిలా..

కువైట్‌లోని మంగఫ్‌ మునిసిపాలిటీ పరిధిలోని ఎన్‌బీటీసీ గ్రూప్‌ భవనంలో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మలయాళీ అయిన కేజీ అబ్రహానికి చెందిన ఎన్‌బీటీసీ కంపెనీలో పనిచేసేవారంతా మలయాళీలు, తమిళులే..! వీరికి వసతి కల్పించేందుకు కువైట్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో భవనాలను నిర్మించారు. మంగాఫ్‌ నగరంలోని ఆరంతస్తుల భవనంలో సుమారు 196 మంది మలయాళీలు, తమిళులు నివసిస్తున్నారు.

కువైట్‌లోని భారతీయులు ఈ భవనాన్ని ‘మలయాళీ క్యాంపు’గా పిలుస్తారు. కువైట్‌ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో ఎన్‌బీటీసీ కార్మికులు నివసించే భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న వంటగదిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో.. క్షణాల్లో మంటలు పైఅంతస్తులకు వ్యాపించాయి. ఎటూ కదల్లేని పరిస్థితుల్లో 50 మందికిపైగా భారతీయులు మృతి చెందారు. 40కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Updated Date - Jun 13 , 2024 | 07:58 AM