PM Modi : యూఏఈ అణుశక్తికి భారత్ సహకారం
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:13 AM
అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి భారత్ సహకారం అందించనుంది. యూఏఈతోపాటు.. అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్‌కు..
యువరాజు అల్ నహ్యన్‌తో మోదీ చర్చలు
నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్(యూఏఈ)కి భారత్ సహకారం అందించనుంది. యూఏఈతోపాటు.. అరేబియా ద్వీపకల్పంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం అయిన బరాకా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నిర్వహణ, ఆపరేషన్స్‌కు.. ఎమిరేట్స్ న్యూక్లియర్ ఎనర్జీ కంపెనీ(ఈఎన్‌ఈసీ)కి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్‌పీసీఐఎల్) సహకరించనుంది. సోమవారం ఢిల్లీలో యూఏఈ యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈఎన్‌ఈసీ, ఎన్‌పీసీఐఎల్ ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి.
అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐవోసీఎల్)కు ఎల్‌ఎన్‌జీని సరఫరా చేసేందుకు అబుధాబి జాతీయ చమురు కంపెనీ(ఏడీఎన్‌వోసీ)తో భారత వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సంస్థ(ఐఎ్‌సపీఆర్‌ఎల్) ఒప్పందం కుదుర్చుకుంది. అబుధాబి ఆన్‌షోర్ బ్లాక్-1కు సంబంధించి ఉర్జా భారత్-ఏడీఎన్‌వోసీ మధ్య.. భారత్‌లో ఫుడ్‌పార్క్‌ల అభివృద్ధికి గుజరాత్ ప్రభుత్వానికి, అబుధాబి డెవల్‌పమెంటల్ హోల్డింగ్ కంపెనీ పీజేఎ్‌సజీ(ఏడీక్యూ)తో ఒప్పందాలు జరిగాయి. ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ మహాత్ముడి సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో బస చేసిన యూఏఈ యువరాజు రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యారు. మంగళవారం ఆయన ముంబైలో జరగనున్న బిజినెస్ ఫోరంలో పాల్గొంటారు.