ఎల్‌ఐసీ ‘బీమా సఖి’ యోజన!
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:00 AM
మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమించనుంది.
మహిళల కోసం కొత్త పథకం
ప్రారంభించిన ప్రధాని మోదీ.. 2 లక్షల మంది నియామకం
మహిళా ఏజెంట్లకు స్టైపెండ్ కూడా.. తొలి మూడేళ్లు చెల్లింపు
పదో తరగతి ఉత్తీర్ణత, 18 నుంచి 70 ఏళ్ల వయసు అర్హత
ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం.. బీమాపై అవగాహనే లక్ష్యం
జీవిత బీమా సంస్థ వెబ్‌సైట్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలు!
న్యూఢిల్లీ, డిసెంబరు 9: మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 70 ఏళ్ల వయసు గల మహిళలను ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ ఏజెంట్లుగా నియమించనుంది. ఈ మేరకు మహిళల సాధికారత కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 2 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే ‘బీమా సఖి యోజన’ను ప్రధాని మోదీ సోమవారం హరియాణాలోని పానిపట్‌లో ప్రారంభించారు. మహిళలకు ఎదురయ్యే అన్ని ఇబ్బందులను తొలగించి, వారు సాధికారులయ్యేలా చేస్తున్నామని ప్రధాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో మన ఆడబిడ్డలు ముందుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బీమా సఖి యోజనలో చేరేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచే ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ పథకం తొలి దశలో భాగంగా 35 వేల మందిని బీమా సఖులుగా నియమించనున్నారు. అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా నియామకాలు చేపట్టనున్నారు. ఎంపికైన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఆర్థిక వ్యవహారాలపై చైతన్యం, బీమాపై అవగాహన కల్పించే ఈ మహిళా ఏజెంట్లకు మూడేళ్ల పాటు స్టైపెండ్ కూడా అందజేయనున్నారు. వీరికి తొలి ఏడాదిలో నెలకు రూ.7 వేల చొప్పున, రెండో ఏడాది నెలకు రూ.6 వేలు, మూడో ఏడాది నెలకు రూ.5 వేల చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఈ పథకం కింద మూడేళ్లలో 2 లక్షల మంది మహిళలను బీమా సఖులను నియమించనున్నారు. శిక్షణ అనంతరం ఎల్‌ఐసీ ఏజెంట్లుగా పనిచేసే వీరికి స్టైపెండ్‌తో పాటు కమీషన్ కూడా అందజేస్తారు. పట్టభద్రులైన బీమా సఖులను ఎల్‌ఐసీలో డెవల్‌పమెంట్ ఆఫీసర్లుగా నియమించే అవకాశం కూడా ఉంటుంది.