Share News

PM Modi : యుద్ధం.. పరిష్కారం కాదు!

ABN , Publish Date - Oct 12 , 2024 | 03:32 AM

యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల వర్ధమాన దేశాలే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi : యుద్ధం.. పరిష్కారం కాదు!

  • యురేషియా, పశ్చిమాసియాల్లో తక్షణమే శాంతిస్థాపన జరగాలి: మోదీ

  • లావోస్‌ సదస్సులో ప్రధాని పిలుపు

వీయెంటీయాన్‌ (లావోస్‌), అక్టోబరు 11: యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల వర్ధమాన దేశాలే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. యుద్ధాలతో సమస్యలకు పరిష్కారం కనుక్కోలేమని స్పష్టం చేశారు. ఆ రెండు ప్రాంతాల్లో వీలైనంత త్వరగా శాంతిసుస్థిరతలను పునరుద్ధరించాలని పిలుపిచ్చారు. లావోస్‌ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారమిక్కడ 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రసంగించారు. తాను బుద్ధభూమి నుంచి వచ్చానని, ఇది యుద్ధాల శకం కాదని తాను పదే పదే చెబుతున్నానని గుర్తుచేశారు.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా పెద్దన్న ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ ప్రాంతం స్వేచ్ఛాయుత, సమ్మిళిత, ప్రగతిశీలంగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో శాంతిభద్రతలు, సుస్థిరత నెలకొనడం యావత్‌ ప్రాంతానికీ మేలు చేకూరుస్తుందన్నారు. సముద్రచట్టంపై ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్‌ (యూఎన్‌క్లో్‌స)కు అనుగుణంగా సముద్రతల కార్యకలాపాలు నడవాలని.. సముద్రతలం, గగనతల స్వేచ్ఛ అత్యవసరమని నొక్కిచెప్పారు.

అన్ని దేశాలూ అభివృద్ధిపైనే దృష్టిపెట్టాలని.. విస్తరణవాదంపై కాదని తేల్చిచెప్పారు. ఇతర దేశాల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, వాటి విదేశీ విధానాలపై ఆంక్షలు విధించరాదని స్పష్టంచేశారు. మానవతాకోణంలో చర్చలు, దౌత్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ‘విశ్వబంధు’గా భారత్‌ ఈ దిశగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుందని హామీ ఇచ్చారు. ప్రసంగం మొదలుపెట్టేముందు.. గతనెలలో ఆగ్నేయాసియా, దక్షిణ చైనాలను అతలాకుతలం చేసిన ‘తైఫూన్‌ యాగీ’ మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Updated Date - Oct 12 , 2024 | 03:32 AM