PM Modi: నా పదవీకాలం ముగిసేలోపు భారత బంగారు భవితే లక్ష్యం.. బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ
ABN , Publish Date - Feb 10 , 2024 | 07:18 AM
తన పదవీకాలం ముగిసేలోపు సుసంపన్నమైన భారత బంగారు భవితను చేరుకునే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) స్పష్టం చేశారు. ఢిల్లీలోని టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని శుక్రవారం మాట్లాడారు.
ఢిల్లీ: తన పదవీకాలం ముగిసేలోపు సుసంపన్నమైన భారత బంగారు భవితను చేరుకునే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) స్పష్టం చేశారు. ఢిల్లీలోని టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని శుక్రవారం మాట్లాడుతూ.. ఓట్ల కోసం రాజకీయాలు చేసేవారు చాలా మంది ఉన్నారని.. వారు దేశాభివృద్ధిపట్ల చిత్తశుద్ధితో పని చేయలేరని అన్నారు.
"దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ విషయంలో అవలంబిస్తున్న వైఖరి ఆ రంగాన్ని పూర్తిగా అంధకారంలోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఇంధన రంగంలో సుస్థిరత, దీర్ఘకాలిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆర్థిక వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకోవాలి. వనరులను సమర్థంగా వాడుకోవాలి. పాలకులకు ముందు చూపు ఉండటం చాలా ముఖ్యం. బీజేపీ 2014లో అధికారంలోకి రాగానే ఆర్థిక స్థితిపై పారదర్శకత ఉండాలని 'శ్వేతపత్రం' తీసుకువచ్చింది. అయితే దేశ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకూడదని 'రాజనీతి' కంటే 'రాష్ట్రనీతి'ని ఎంచుకున్నాను. 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించగలం. అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. దాన్ని పరిశీలిస్తే 10 ఏళ్ల కిందట భారత్ ఎక్కడుండేది.. ప్రస్తుతం ఎక్కడుందో తెలుస్తుంది. ప్రస్తుతం దేశ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రపంచ వేదికలపై భారత్ సత్తా చాటుతోంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లా నడిపిస్తూ బీజేపీ ముందుకు సాగుతోంది" అని మోదీ ఉద్ఘాటించారు.
దేశ ఆర్థిక స్థితిని వివరిస్తూ ఫిబ్రవరి 8న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శ్వేతపత్రం సమర్పించారు.