Ayodhya Modi: అయోధ్యతో ముడిపడిన మోదీ 30 ఏళ్ల బంధం..
ABN , Publish Date - Jan 03 , 2024 | 03:44 PM
జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించిన భవ్య రామమందిరంలో రాముడు కొలువుతీరుతున్నాడు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 30 ఏళ్ల క్రితం రామాలయం కోసం చేసిన ప్రతిన, ఆ కల నేటికి సాకారం కానుండటం మరోసారి దేశ ప్రజానీకం నెమరువేసుకుంటోంది.
న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya)ను 14 వేల సంవత్సరాల పాటు సుభిక్షంగా పరిపాలించి ''రామరాజ్యం'' అనే పేరును సుస్థిరం చేసిన శ్రీరాముడు తిరిగి రామజన్మభూమిలో కొలువు తీరుతున్న మధుర క్షణాల కోసం భరతజాతి ఎదురుచూస్తోంది. మా తరంలో రాముడి గుడి చూడగలమా అని వేలాది మంది ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించిన భవ్య రామమందిరం (Ram Temple)లో రాముడు కొలువుతీరుతున్నాడు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ''నభూతో నభవిష్యతి'' అనేలా నిర్వహించేందుకు యూపీ సర్కార్ 'శబరి హోటళ్లు', 'గుహుడి సత్రం' పేరుతో...ముఖ్యంగా రామాయణం లోని ప్రధాన పాత్రల పేర్లు గుర్తొచ్చేలా, వివిధ భాషల్లో ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులతో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో రామాలయం కోసం రామభక్తులు ఏళ్లుగా చేసిన ప్రతినలు, జ్ఞాపకాలు అందరి కళ్లముందు మొదలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 30 ఏళ్ల క్రితం రామాలయం కోసం చేసిన ప్రతిన, ఆ కల నేటికి సాకారం కానుండటం మరోసారి దేశ ప్రజానీకం నెమరువేసుకుంటోంది.
1992 జనవరి 14న ప్రతిన... జనవరితో మోదీ అనుబంధం
నరేంద్ర మోదీ 1992 జనవరి 14న 'రామ ప్రతిన' చేశారు. సరిగ్గా 32 ఏళ్లకు 2024 జనవరిలోనే ఆ ప్రతిన నెరవేరబోతోంది. రాముడి జన్మస్థలంలోని రామాలయాన్ని 500 ఏళ్ల క్రితం బాబర్ హయాంలో జనరల్ మీర్ బఖి కూల్చివేసి ఆ ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించాడు. రాముడి జన్మస్థలంలో తిరిగి రామాలయం నిర్మించాలనే ఆకాంక్ష స్వాతంత్ర్య సిద్ధించక ముందు నుంచే ప్రజల్లో బలంగా ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు ఈ కలను సాకారం చేసే దిశగా ముందడుగు వేశారు. మెల్లమెల్లగా తమ లక్ష్యం వైపు పయనం సాగించారు. 1990లో రామాలయ ఉద్యమాన్ని తీవ్రం చేశారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణి సారథ్యంలో సోమ్‌నాథ్ నుంచి చేపట్టిన రథయాత్రకు ప్రధాన సమన్వయకర్త (కోఆర్డినేటర్)గా మోదీ వ్యవహరించారు. అనంతరం, రామ భక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు 1991 డిసెంబర్ 11ను కన్యాకుమారి నుంచి అయోధ్య వరకూ బీజేపీ ''ఐక్యతా యాత్ర'' చేపట్టింది. 1992 జనవరి నాటికి ఈ ఐక్యతా యాత్ర అయోధ్యకు చేరుకుంది. బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి, సంఘ్ మాజీ ప్రచారకర్త, గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నరేంద్ర మోదీ కూడా యాత్రలో పాల్గొని అయోధ్యలో ఒక టెంట్‌లో ఉన్న రామ్ లల్లాను దర్శించుకున్నారు. ఆరోజే అయోధ్యలో భవ్య రామాలయం నిర్మించి, అందులో రామ్ లల్లా ప్రతిష్టించేలా చూస్తామని మోదీ ప్రతిన బూనినట్టు ఆయన సన్నిహితులు నేటికీ చెబుతారు.
కాల చక్రం గిర్రున తిరిగి, రామజన్మభూమి కోసం దశాబ్దాలుగా చేసిన న్యాయపోరాటం ముగిసింది. అన్ని అడ్డకుంలను తొలగించి అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా మోదీ ముందుకు కదిలారు. రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రామాలయం తొలిదశ నిర్మాణం పూర్తి కావడంతో రామ్ లల్లా కొలువుతీరడానికి ముహూర్తం కూడా నిశ్చయమైంది. టెంట్‌లోనే ఏళ్ల తరబడి దర్శనమిచ్చిన రాముడిని మందిరానికి చేర్చుతాననే మోదీ ప్రతిన సైతం నెరవేరబోతోంది. 2024 జనవరి 22న రామాలయంలోని గర్భగుడిలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటున్నారు. దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్నట్టే తాను కూడా రామాలయ ప్రారంభం ఎప్పడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మోదీ సైతం ప్రకటించారు.