PM Modi: కొత్త పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. 5 కోట్ల మందికి లబ్ది
ABN , Publish Date - Oct 02 , 2024 | 05:06 PM
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (బుధవారం) మరో ముఖ్యమైన పథకాన్ని ఆవిష్కరించారు.
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (బుధవారం) మరో ముఖ్యమైన పథకాన్ని ఆవిష్కరించారు.
జార్ఖండ్‌లో ‘ధరి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ను ఆయన ప్రారంభించారు. ఏకంగా రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఈ పథకం కింద 5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ధరి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ కింద సుమారు 63 వేల గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, 5 కోట్లకు పైగామంది లబ్ధి పొందుతారని తెలిపారు.
" సుమారు రూ.80,000 కోట్ల నిధులతో ధరి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్‌ను ప్రారంభించాను. సుమారు 63 వేల గిరిజన గ్రామాల అభివృద్ధిని కవర్ చేస్తుంది. సుమారు 5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు. భగవాన్ బిర్సా ముండా పుట్టిన నేల నుంచి ఈ పథకం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది’’ అని ప్రధాని మోదీ చెప్పారు. గిరిజన యువతకు చక్కటి విద్యావకాశాలు లభించినప్పుడే గిరిజన సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే గిరిజన ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. 40 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ప్రారంభం కానున్నాయని, ఇప్పటికే 25 స్కూల్స్‌కు శంకుస్థాపన జరిగిందని అన్నారు.
ధరి ఆబాబ జనజాతీయ గ్రామ్ ఉత్కర్స్ అభియాన్ కాకుండా.. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో మరో రూ.83,300 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాగా 17 రోజుల వ్యవధిలో ప్రధాని మోదీ జార్ఖండ్‌లో పర్యటించడం ఇది రెండవసారి.
ఇక జార్ఖండ్ అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్స్ వేదికగా కూడా మోదీ స్పందించారు. ‘‘జార్ఖండ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిని అయ్యే అవకాశం ఇవాళ మరోసారి నాకు దక్కింది. కొన్ని రోజుల క్రితమే నేను జంషెడ్‌పూర్‌కు వచ్చాను. వందల కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాను. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద జార్ఖండ్‌లోని వేలాది మంది పేదలకు సొంత పక్కా ఇళ్లు లభించాయి. ఇక రోజుల వ్యవధిలోనే జార్ఖండ్‌లో రూ.80 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ పథకాలు గిరిజన సమాజం సంక్షేమం, అభ్యున్నతికి సంబంధించినవి’’ అని ఎక్స్‌లో మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఆ హీరోయిన్లతో కేటీఆర్ ఏం చేశారంటే.. కొండా సురేఖ సంచలన ఆరోపణలు
బంకర్‌లోకి పరుగు తీసిన ప్రధాని.. వీడియో వైరల్..