Share News

Pranab Mukharjee: 'ప్రణబ్ మై ఫాదర్..' పుస్తకాన్ని మోదీకి అందజేసిన శర్మిష్ట ముఖర్జీ

ABN , Publish Date - Jan 15 , 2024 | 09:05 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి శర్మిష్ట ముఖర్జీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సోమవారంనాడు కలుసుకున్నారు. తాను రాసిన ''ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్'' అనే పుస్తకం ప్రతిని ప్రధానికి అందజేశారు. ఈ విషయాన్ని శర్మిష్ట ముఖర్జీ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు.

Pranab Mukharjee: 'ప్రణబ్ మై ఫాదర్..' పుస్తకాన్ని మోదీకి అందజేసిన శర్మిష్ట ముఖర్జీ

న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (Pranab Mukherjee) కుమార్తె, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి శర్మిష్ట ముఖర్జీ (Sharmistha Mukherjee) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narnedra Modi)ని సోమవారంనాడు కలుసుకున్నారు. తాను రాసిన ''ప్రణబ్ మై ఫాదర్: ఏ డాటర్ రిమెంబర్స్'' (Pranab, My father: A Daughter Remembers) అనే పుస్తకం ప్రతిని ప్రధానికి అందజేశారు. ఈ విషయాన్ని శర్మిష్ట ముఖర్జీ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. ప్రధానితో కలిసిన ఫోటోలను షేర్ చేశారు. తన తండ్రి ప్రణబ్‌పై మోదీకి ఉన్న గౌరవం చెక్కుచెదరలేదని ప్రశంసించారు. పుస్తకం ప్రతిని మోదీకి అందజేశానని, ఎప్పటిలాగే ఆయన తన పట్ల ఎంతో ఆదరాభిమానాలు చాటారని, తన తండ్రి పట్ల ఆయనకున్న గౌరం ఏమాత్రం తగ్గలేదని శర్మిష్ట పేర్కొన్నారు. మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు.


పుస్తకంలో గాంధీ కుటుంబంపై ఆసక్తికర విషయాలు..

తన తండ్రితో జ్ఞాపకాలు, పలు సంఘటనలను శర్మిష్ట తాను రాసిన పుస్తకంలో గుర్తుచేసుకున్నారు. గాంధీ కుటుంబంపై తన తండ్రికి ఉన్న అభిప్రాయాలు, రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాలపై ఉన్న వెలిబుచ్చిన అనుమానాలను సైతం అందులో ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఇంకా పరిక్వతత చెందాలని తన తండ్రి అభిప్రాయపడేవారని ఆమె పేర్కొన్నారు. ఇందుకు ఒక ఉదాహరణగా ఒక ఘటన చెప్పారు. ''ఒకరోజు ప్రణబ్ అలవాటు ప్రకారం మొఘల్ గార్డెన్స్‌లో (ఇప్పుడు అమృత్ ఉద్వాన్) మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆయనను చూసేందుకు రాహుల్ వచ్చారు. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు కానీ, పూజా సమయంలో కానీ ఏదైనా అవాంతరం వస్తే ప్రణబ్‌కు ఇష్టం ఉండేది కాదు. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా రాహుల్‌ను కలిసేందుకే ఆయన నిర్ణయించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రణబ్‌ను సాయంత్రం సమయంలో రాహుల్ కలవాల్సి ఉంది. కానీ రాహుల్ కార్యాలయం పొరపాటున ఇద్దరి మధ్య ఉదయం సమావేశం ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. ఈ విషయం ఒక అధికారి ద్వారా నాకు తెలిసింది. దీని గురించి నాన్న గారిని అడిగాను. ఆయన వెంటనే ఒక మాట అన్నారు. రాహుల్ కార్యాలయానికి ఏఎం (AM)కు, పీఎం(PM)కు మధ్య తేడా తెలియకపోతే వాళ్లు ఒకనాటికి పీఎంఓను ఎలా నడపగలుగుతారని అన్నారు'' అని శర్మిష్ట తన పుస్తకంలో రాశారు. ప్రణబ్ ముఖర్జీ రాసుకున్న డైరీలో ఆయన రాహుల్‌ను క్యాబినెట్ చేరడం ద్వారా ప్రభుత్వ వ్యవహారాల్లో అనుభవం సంపాదించుకోవాలని సూచించిన విషయాన్ని కూడ శర్మిష్ట తన పుస్తకంలో రాశారు.


ప్రధాని పదవిని ప్రణబ్ ఆశించినప్పటికీ..

ప్రధానమంత్రి పదవిపై తన తండ్రికి ఆసక్తి ఉన్న విషయాన్ని కూడా శర్మిష్ట ప్రస్తావించారు. ప్రధాని కావాలని ప్రణబ్ అనుకున్నప్పటికీ సోనియాగాంధీ తన కుటుంబ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు మన్మోహన్ సింగ్‌ను ప్రధానిని చేసేందుకు 2004లో మార్గం సుగమం చేశారని చెప్పారు. సోనియా గాంధీ అధికారాన్ని తాను సవాలు చేసేవాడినా, కాదా అనేది ప్రశ్నకాదని, తనకున్న అధికారాన్ని ఎవరూ పశ్నించరాదని సోనియా భావించారని, తన అధికారాన్ని ప్రశ్నించని వ్యక్తినే ప్రధానిని చేయడం ద్వారా తన సొంత, కుటుంబ ప్రయోజనాలను సోనియా కాపాడుకున్నారని ప్రణబ్ పేర్కొన్నట్టు శర్మిష్ట తన పుస్తకంలో తెలిపారు.

Updated Date - Jan 15 , 2024 | 09:05 PM