Hasina resignation: బంగ్లాదేశ్‌లో మళ్లీ టెన్షన్.. టెన్షన్
ABN , Publish Date - Oct 24 , 2024 | 05:01 AM
బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా లేఖ గురించి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని రేపా యి.
హసీనా రాజీనామాపై దేశాధ్యక్షుడి వ్యాఖ్యలతో ఉద్రిక్తత
ఢాకా, అక్టోబరు 23: బంగ్లాదేశ్‌లో మళ్లీ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా లేఖ గురించి బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహబుద్దీన్ చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర దుమారాన్ని రేపా యి. గత వారం ఓ స్థానిక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షహబుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘ఆగస్టు 5న హసీనా రాజీనామా చేసినట్లు విన్నాను కానీ దాన్ని ధ్రువీకరించేందుకు ఆమె రాజీనామా లేఖ సహా నా వద్ద ఎటువంటి ఆధారం లేదు. ఎంత ప్రయత్నించినా ఆ లేఖ లభ్యం కాలేదు.
బహుశా ఆ సమయంలో హసీనాకు రాజీనామా లేఖ ఇచ్చే సమయం దొరకలేదేమో’’ అని వ్యాఖ్యానించారు. దాంతో ఆందోళనకారులు భగ్గుమన్నారు. అధ్యక్ష భవనం బంగభవన్‌ను ముట్టడించి షహబుద్దీన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. పోలీసులు.. ఆర్మీ సిబ్బంది సాయంతో బంగభవన్ దగ్గర పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఆగస్టు 5న త్రివిధదళాధిపతుల సమక్షంలో అధ్యక్షుడు షహబుద్దీన్ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో హసీనా రాజీనామా చేశారని.. తాను ఆమోదించానని చెప్పారని, ఇప్పుడేమో తన వద్ద రాజీనామా లేఖ లేదని పేర్కొనడం సరికాదని తాత్కాలిక ప్రభుత్వ న్యాయ వ్యవహారాల సలహాదారుడు ఆసిఫ్ నజ్రుల్ దుయ్యబట్టారు.