Prashant Kishor: బీజేపీకి ఎన్ని లోక్‌సభ సీట్లు వస్తాయంటే... పీకే జోస్యం
ABN , Publish Date - May 21 , 2024 | 03:21 PM
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం విజయతీరాలకు చేర్చే అవకాశాలున్నాయని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2019లో బీజేపీ సాధించిన 303 సీట్లకు దగ్గరగా కానీ, దానికి స్వల్పంగా అధిగమించే అవకాశాలు కానీ ఈసారి ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
న్యూఢిల్లీ: 2024 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) బీజేపీని మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నాయకత్వం విజయతీరాలకు చేర్చే అవకాశాలున్నాయని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అన్నారు. 2019లో బీజేపీ సాధించిన 303 సీట్లకు దగ్గరగా కానీ, దానిని స్వల్పంగా అధిగమించే అవకాశాలు కానీ ఈసారి (2024) ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.
"మోదీ సారథ్యంలోని బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను. గత ఎన్నికల్లో సాధించిన సీట్లతో సమానంగా ఈసారి సీట్లు గెలుచుకోవచ్చు. లేదంటే కొద్దిగా సీట్లు పెరగనూ వచ్చు'' అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
Lok Sabha elections 2024: ఐదో దశలో తగ్గిన పోలింగ్ శాతం.. 2019తో పోలిస్తే తగ్గిందా, పెరిగిందా?
సహజంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల కానీ, వారి నేతలపై కానీ కోపం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయం ఉందా లేదా అనేది కూడా చూడకుండా ప్రజలు వారిని సాగనంపుతారని, అయితే ఇంతవరకూ మోదీపై విస్తృతమైన ప్రజాగ్రహం ఉన్నట్టు వినిపిచండం లేదని పీకే చెప్పారు. ''ప్రజలు నిరాశచెంది ఉండొచ్చు...తమ కలలు సాకారం కాలేదని అనుకోవచ్చు. కానీ విస్తృత ప్రజాగ్రహం ఉన్నట్టు ఎవరూ చెప్పుకోవడం లేదు'' అని ఆయన వివరించారు.
బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, బీజేపీ 370 సీట్లు ఆశిస్తున్నామని చెబుతున్నా 270 సీట్లు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆ పార్టీ నాయకులు చెప్పలేరని అన్నారు. ఆ ప్రకారం చూసినప్పుడు వారు మెజారిటీకి అవసరమైన 272 సీట్లు సాధిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంటుందన్నారు. అయితే ఎలాంటి రిస్క్ ఉండదనే తాను అనుకుంటున్నానని, ఎన్డీయే తిరిగి అధికారంలోకి వచ్చేలాగానే కనిపిస్తోందని అన్నారు.
Read Latest National News and Telugu News