Prashant Kishor: మాకే అధికారమిస్తే మద్యంపై నిషేధం గంటలో ఎత్తేస్తా
ABN , Publish Date - Sep 15 , 2024 | 03:04 PM
అక్టోబర్ 2న జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ ఆదివారంనాడు మాట్లాడుతూ, 2న పార్టీ ఆవిర్భావం కోసం ప్రత్యేక సన్నాహకాలు అవసరం లేదని, రెండు సంవత్సరాలు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.
పాట్నా: బీహార్ (Bihar)లో తమ పార్టీ అధికారంలోకి రాగానే మద్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తామని జన్ సురాజ్ (Jan Suraj) పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore) హామీ ఇచ్చారు. అక్టోబర్ 2న తమ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మీడియాతో ఆదివారంనాడు మాట్లాడుతూ, 2న పార్టీ ఆవిర్భావం కోసం ప్రత్యేక సన్నాహకాలు అవసరం లేదని, రెండు సంవత్సరాలు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడిన గంటలోపే మద్యపాన నిషేధాన్ని రద్దు చేస్తామన్నారు.
ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ రాష్ట్రంలో చేపట్టిన యాత్రపై అడిగినప్పుడు, ఇప్పటికైనా ఆయన ప్రజల మధ్యకు వెళ్తున్నందుకు బెస్ట్ విషెస్ చెబుతున్నానని అన్నారు. బీజేపీ సారథ్యంలోని నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ (ఎన్డీయే)లో చేరినందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారంటూ తేజస్వి చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా స్పందించారు. ఎవరు ఎవరికి చేతులు జోడించి క్షమాపణలు చెప్పారనేది ప్రధానం కాదని, ఇద్దరు నేతల వల్ల బీహార్‌కు నష్టమే జరిగిందని అన్నారు. 30 ఏళ్లుగా వారిని ప్రజలు వారిని భరిస్తూనే ఉన్నారని, ఈ ఇద్దరూ బీహార్‌ను విడిచి వెళ్లాలని తాము కోరుకుంటున్నామని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
Aravind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం..
తేజస్విపై గతంలోనూ చురకలు
దీనికి ముందు, బీహార్ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం తేజస్వికి ఏముందని కూడా పీకే ప్రశ్నించారు. వనరులు లేక చదువుకోకుంటే అర్ధం చేసుకోగలమని, ఒక వ్యక్తి తల్లిదండ్రులు ముఖ్యమంత్రులుగా ఉండి కూడా 10వ తరగతి కూడా ప్యాస్ కాలేదంటే విద్య పట్ల అతనికున్న అవగాహన అర్ధం చేసుకోగలమని తేజస్విపై విమర్శలు గుప్పించారు. తొమ్మిదో తరగతి డ్రాపవుట్ అయిన వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఎలా నడిపిస్తారని నిలదీశారు. జీడీపీకి, జీడీపీ వృద్ధికి కూడా ఆయనకు తేడా తెలియదన్నారు. లాలూ ప్రసాద్ తనయుడిగా కాకుండా కష్టపడి పనిచేసి తనను తాను తేజస్వి నిరూపించుకోవాలన్నారు.