National : తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలి
ABN , Publish Date - Jun 03 , 2024 | 07:01 AM
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాటికి స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ మరింత అద్భుత ప్రగతిని సాధించాలని వారు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు.
భిన్న సంస్కృతులకు నెలవు తెలంగాణ: రాష్ట్రపతి ముర్ము
రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నాం: మోదీ
న్యూఢిల్లీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నాటికి స్వరాష్ట్రం సిద్ధించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణ మరింత అద్భుత ప్రగతిని సాధించాలని వారు సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షించారు. గొప్ప వారసత్వం, భిన్న సంస్కృతులు తెలంగాణ సొంతమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు.
‘‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ సుసంపన్నమైన వారసత్వం, మిశ్రమ సంస్కృతి, ఔత్సాహిక ప్రజలకు నెలవు. తెలంగాణ దేశంలోనే ముఖ్యమైన టెక్నాలజీ హబ్‌గా అవతరించింది. తెలంగాణ ప్రజలు నిరంతరం అభివృద్థి చెందుతూ దేశాభివృద్థికి తోడ్పడాలని నేను ప్రార్థిస్తున్నా’’ అని రాష్ట్రపతి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘‘తెలంగాణ సోదర సోదరీమణులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి తెలంగాణ అందించిన సహకారం గొప్పది. ఇది ప్రతి భారతీయునికి ఎంతో గర్వకారణం. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృతి తెలంగాణ ప్రత్యేకతలు. తెలంగాణ అభివృద్థికి భవిష్యత్తులోనూ నిరంతరం కృషి చేసేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ఎక్స్ వేదికగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు.