Share News

PM Modi: కాంగ్రెస్‌ కుల క్రీడ!

ABN , Publish Date - Nov 09 , 2024 | 05:46 AM

భారతీయ సమాజాన్ని కులాల పేరిట చీల్చాలని కాంగ్రెస్‌ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మరో కులంపైకి ఉసిగొల్పుతూ ప్రమాదకర క్రీడ ఆడుతోందని మండిపడ్డారు.

PM Modi: కాంగ్రెస్‌ కుల క్రీడ!

  • ఒకరిపై మరొకరిని ఉసిగొల్పుతోంది: మోదీ

  • దళితులు, ఓబీసీలు, గిరిజనుల అభ్యున్నతి ఆ పార్టీకి ఇష్టం లేదు

  • వారి ఐక్యతను దెబ్బతీయడమే కాంగ్రెస్‌ ‘యువరాజు’ పని

  • ఆ పార్టీ పరాన్నజీవిగా మారింది

  • మహారాష్ట్ర ప్రచారంలో ప్రధాని మోదీ

నాసిక్‌, నవంబరు 8: భారతీయ సమాజాన్ని కులాల పేరిట చీల్చాలని కాంగ్రెస్‌ చూస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం ఒక కులాన్ని మరో కులంపైకి ఉసిగొల్పుతూ ప్రమాదకర క్రీడ ఆడుతోందని మండిపడ్డారు. జాతి మొత్తం హెచ్చరికగా ఉండాలని.. అన్ని వర్గాలు ఐకమత్యంగా ఉంటేనే భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ధూలే, నాసిక్‌ సభల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో ఇవే ఆయన మొదటి ర్యాలీలు. కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ చేస్తున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ.. ఎస్సీ, ఎస్టీలు, బీసీల ఐక్యతను చెడగొట్టడమే ఆ పార్టీ ప్రధాన ఎజెండా అని మోదీ విమర్శించారు. ‘గిరిజన తెగల మధ్య చిచ్చు పెట్టాలన్నది కాంగ్రెస్‌ ఎజెండా.


మతపరమైన గ్రూపులతో కలిసి గతంలో ఈ కుట్ర పన్నినప్పుడు దేశ విభజనకు దారితీసింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను ఒకరిపై మరొకరిని రెచ్చగొడుతోంది. దళితులు, బీసీలు, గిరిజనుల పురోగతి దానికి ఇష్టం ఉండదు. అందుకే కులాలవారీగా వారిని విభజించాలని చూస్తోంది. ముఖ్యంగా ఎస్సీలు, ఎస్టీలు బలహీనంగా ఉండాలన్నదే దాని ఉద్దేశం. నెహ్రూ కాలం నుంచీ కాంగ్రెస్‌, ఆయన కుటుంబం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్నాయి. గాంధీ-నెహ్రూ కుటుంబ నాలుగో తరం యువరాజు (రాహుల్‌) కూడా ఈ దిశగానే పనిచేస్తున్నారు. మనందరం ఒక్కటిగా ఉంటేనే భద్రంగా ఉంటాం (ఏక్‌ హై తో సేఫ్‌ హై)’ అని నినదించారు. కాంగ్రెస్‌ పరాన్నజీవిగా మారిందన్నారు. ఊతకర్రలపై నడుస్తోందని చెప్పారు. మహారాష్ట్ర, యూపీ, బిహార్‌, జార్ఖండ్‌ సహా పలు రాష్ట్రాల్లో మిత్రపక్షాల మద్దతుంటే తప్ప పోరాడలేని పరిస్థితిలో ఉందన్నారు. కాగా, తన ప్రభుత్వ హయాంలో పదేళ్లలో దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి చేశామన్నారు.


  • ఎంవీఏలో కుర్చీలాట!

కాంగ్రెస్‌, ఎన్‌సీపీ(శరద్‌ పవార్‌), ఉద్ధవ్‌ శివసేనలతో కూడిన మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)లో సీఎం కుర్చీ కోసం అంతర్గత పోరాటం జరుగుతోందని మోదీ అన్నారు. ఎంవీఏ బండికి చక్రాలు గానీ, బ్రేకులు గానీ లేవని.. అందులోని ప్రతి పార్టీ డ్రైవర్‌ సీటులో కూర్చోవాలని తహతహలాడుతోందని ఎద్దేవాచేశారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్రలో అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుందని.. బీజేపీ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం మాత్రమే సత్పరిపాలన అందించగలదని స్పష్టం చేశారు. జమ్మూకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను రద్దుచేశామని చెప్పారు. కానీ, ఇండీ కూటమి భారత రాజ్యాంగాన్ని కశ్మీరులో లేకుండా చేయాలని చూస్తోందని.. ప్రపంచంలో ఏ శక్తీ ఆ అధికరణను పునరుద్ధరించజాలదని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ ఎజెండాను ప్రోత్సహించవద్దని.. వేర్పాటువాదుల భాష మాట్లాడవద్దని ఆ కూటమి పార్టీలను మోదీ కోరారు. ప్రజల ఆశీర్వాదం తనకున్నంత వరకు ఆ పార్టీల ఎజెండా నెరవేరదన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 05:46 AM