PM Modi: మన్మోహన్ జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయక పాఠం
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:14 AM
దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జీవితం భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయక పాఠంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అనేక సవాళ్ల మధ్య ఆయన అసాధారణ విజయాలు సాధించారు
వీడియో సందేశంలో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, డిసెంబరు 27: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ జీవితం భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిదాయక పాఠంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ విభజన తర్వాత సర్వస్వమూ పాకిస్థాన్‌లో వదిలేసి భారత్‌కు వచ్చిన కుటుంబానికి చెందిన మన్మోహన్.. తీవ్రమైన సమస్యల మధ్య కూడా అనేక అసాధారణ విజయాలు సాధించారని గుర్తు చేశారు. ఈ మేరకు మోదీ శుక్రవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘దేశ ప్రజానీకం పట్ల, దేశాభివృద్ధి పట్ల మన్మోహన్ అంకితభావం ఎల్లప్పుడూ గౌరవాన్ని అందుకుంటుంది. ఆయన మృతి దేశానికి తీరని నష్టం కలిగించింది. హుందాతనం మూర్తీభవించిన వ్యక్తిగా, మేధావిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణలకు అంకితమైన నాయకుడిగా మన్మోహన్ ఎప్పటికీ గుర్తుండిపోతారు’ అని మోదీ తెలిపారు. సవాళ్లతో కూడుకున్న సమయంలో మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారని, పీవీ నరసింహారావు హయాంలో కేంద్ర ఆర్థికమంత్రిగా దేశాన్ని నూతన ఆర్థిక పథంలో నిలిపారని, ప్రధానిగా దేశాభివృద్ధికి కట్టుబడి సేవలందించారని వివరించారు. వ్యక్తిగతంగా మన్మోహన్ పాటించిన విలువలనూ మోదీ ప్రశంసించారు. ‘ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో చదువుకొని, ఉన్నత హోదాల్లో పని చేసిన మన్మోహన్‌సింగ్.. తన మూలాలను, వాటి తాలూకు విలువలను ఎన్నడూ మర్చిపోలేదు. నిజాయితీ, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా జీవితం గడిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారు. కొన్నేళ్లుగా ఆరోగ్యం సహకరించకపోయినా వీల్‌చెయిర్‌లో వచ్చి పార్లమెంటు కార్యకలాపాలకు హాజరయ్యారు’ అని గుర్తు చేశారు. మన్మోహన్‌సింగ్‌ది రాజకీయపార్టీలకు అతీతమైన వ్యక్తిత్వమని, తాను గుజరాత్ సీఎంగా ఉన్న రోజుల్లో అనేక జాతీయ, అం తర్జాతీయ అంశాలపై ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ను కలిసి మాట్లాడేవాడినని మోదీ పేర్కొన్నారు. 2014లో తాను ప్రధాని అయిన తర్వాతా మన్మోహన్‌ను ఆయన పుట్టినరోజున కలిసి మాట్లాడానని తెలిపారు.
బెళగావిలో మన్మోహన్ సంస్మరణ సభ
బెంగళూరు, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహాత్మాగాంధీ బెళగావిలో బాధ్యతలు చేపట్టి వందేళ్లు గడిచిన సందర్భం గా నిర్వహిస్తున్న సభ.. రెండో రోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంస్మరణ సభగా మారింది. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ సభను రద్దు చేసి, అక్కడే మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ నిర్వహిం చారు. కేపీసీసీ ఆధ్వర్యంలో శుక్రవారం మన్మోహన్‌సింగ్ సంస్మరణ సభ నిర్వహించారు. సీఎం సిద్దరామ య్య, మంత్రులు పుష్పాంజలి ఘటించారు.