Share News

Priyanka Gandhi: రాహుల్‌పై విచారణ

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:23 AM

పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి..

Priyanka Gandhi: రాహుల్‌పై విచారణ

పార్లమెంటు ఆవరణలో బాహాబాహీ ఘటనపై పోలీసులు ప్రశ్నించే అవకాశం

‘అంబేడ్కర్‌కు అవమానం’ అంశంనుంచి దృష్టి మరల్చేందుకే: ప్రియాంక

న్యూఢిల్లీ, డిసెంబరు 20: పార్లమెంటు ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటుచేసుకున్న బాహాబాహీ ఘటనకు సంబంధించి.. ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని ప్రశ్నించనున్నట్లుగా ఢిల్లీ పోలీసు వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఎంపీల మధ్య తోపులాట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడటం, రాహుల్‌గాంధీపై పార్లమెంటు స్ట్రీట్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటం తెలిసిన విషయమే. దీనిపై రాహుల్‌ మీద పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేశారు. దీంట్లో భాగంగానే ప్రతిపక్షనేతను ప్రశ్నించనున్నట్లు సమాచారం. కాగా, రాహుల్‌పై నమోదైన కేసు ఢిల్లీ క్రైం బ్రాంచ్‌కు బదిలీ అయింది. ఇదే ఘటనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే గాయపడటంపై ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీలపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోపులాట ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను పరిశీలించటానికి అనుమతించాలని పార్లమెంటు సెక్రటేరియట్‌ను పోలీసులు కోరే అవకాశం ఉందని తెలిసింది. కాగా, పార్లమెంటు ఘటన సందర్భంగా రాహుల్‌ తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్‌నాన్‌ కొన్యాక్‌ ఆరోపించిన నేపథ్యంలో మహిళా కమిషన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరింది.


రాహుల్‌ ఎన్నడూ అలా చేయరు

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు కావటంపై ఆయన సోదరి, కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకగాంధీ స్పందిస్తూ శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. అమిత్‌షా వ్యాఖ్యల వల్ల అంబేద్కర్‌కు జరిగిన అవమానాన్ని భారతదేశం సహించదన్న విషయం బీజేపీకి తెలుసు కాబట్టే.. ఈ తరహాలో దృష్టి మరల్చే పనులకు పాల్పడుతోందన్నారు. అంబేద్కర్‌ పట్ల బీజేపీకి ఉండే అసలు అభిప్రాయాలు ఇప్పుడు బయటపడ్డాయని, దీనివల్లే ఆ పార్టీ భయపడుతోందని విమర్శించారు. కేంద్రానికి చర్చలంటే భయమని, అందుకనే అదానీతోపాటు ఏ అంశంపైనా పార్లమెంటులో చర్చకు ముందుకు రావటం లేదన్నారు. రాహుల్‌ ఎలాంటివాడో ఆయన సోదరిగా తనకు తెలుసునని ప్రియాంక పేర్కొన్నారు. ‘రాహుల్‌ ఎవరినీ నెట్టివేయరు. అటువంటి పని ఆయన ఎన్నడూ చేయరు. ప్రభుత్వం పూర్తి నిరాశలో కూరుకుపోయింది. అందువల్లే రాహుల్‌పై పలు తప్పుడు కేసులు నమోదు చేస్తోంది’ అని ఆరోపించారు.

ప్రియాంకకు ‘1984’ బ్యాగును బహూకరించిన బీజేపీ ఎంపీ

ప్రియాంకా గాంఽధీకి శుక్రవారం పార్లమెంటులో అనూహ్య పరిణామం ఎదురైంది. బీజేపీ మహిళా ఎంపీ అపరాజిత సారంగి.. ప్రియాంకకు ‘1984’ అని ఎరుపు రంగుతో రాసి ఉన్న బ్యాగును బహుమతిగా ఇచ్చారు. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కుల ఊచకోతను గుర్తుచేసే విధంగా బ్యాగును రూపొందించారు. అయితే ప్రియాంక మాత్రం తొలుత బ్యాగును తీసుకోవడానికి నిరాకరించినా... కొద్దిసేపటికి తీసుకొని పక్కన పడేసి వెళ్లిపోయారు. ఇందుకు సంబంఽధించిన దృశ్యాలను సోషల్‌ మీడియాలో బీజేపీ ఎంపీ పోస్టు చేశారు.

Updated Date - Dec 21 , 2024 | 04:25 AM