Priyanka Gandhi: రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదు!
ABN , Publish Date - Dec 14 , 2024 | 04:24 AM
భారత రాజ్యాంగం అంటే ‘సంఘ్’ రూపొందించిన నియమాలు, విధానాల పుస్తకం కాదన్న విషయం ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్లు ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు.
ఇది ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్లుంది.. స్వేచ్ఛ, న్యాయానికి రాజ్యాంగమే రక్షా కవచం
దాన్ని బద్దలు కొట్టడానికి బీజేపీ చేయని ప్రయత్నం లేదు
రాజ్యాంగంపై చర్చలో ప్రియాంక
రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి కాంగ్రెస్ యత్నం: రాజ్‌నాథ్‌సింగ్
న్యూఢిల్లీ, డిసెంబరు 13: భారత రాజ్యాంగం అంటే ‘సంఘ్’ రూపొందించిన నియమాలు, విధానాల పుస్తకం కాదన్న విషయం ప్రధాని మోదీకి ఇంకా అర్థం కానట్లు ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చి ఉంటే రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను ప్రారంభించేందన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని లోక్‌సభలో రెండు రోజుల ప్రత్యేక చర్చ శుక్రవారం మొదలైంది. ఈ చర్చను కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. విపక్షాల తరఫున తొలుత ప్రియాంక గాంధీ ప్రసంగించారు. లోక్‌సభలో ప్రియాంక మొట్టమొదటి ప్రసంగం ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమె బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. న్యాయానికి, ఐక్యతకు, భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగమే రక్షా కవచమని పేర్కొన్నారు. ఈ రక్షా కవచాన్ని బద్దలు కొట్టడానికి పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. బ్రిటిష్ వాళ్లు దేశ ప్రజలను ఎలా భయపెట్టాలని చూశారో.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ అలాగే చేస్తోందని చెప్పారు.
ఇలాంటి పిరికివాళ్ల చేతుల్లో దేశం ఎంతో కాలం ఉండదని, ప్రజలు న్యాయం కోసం తిరగబడతారని హెచ్చరించారు. ఒక్కరికి మేలు చేయడం కోసం కేంద్రంలోని బీజేపీ సర్కారు 142కోట్ల మంది భారతీయులను విస్మరిస్తోందని ప్రియాంక అదానీని ఉద్దేశించి అన్నారు. ప్రియాంక మొత్తం 32 నిమిషాల పాటు ప్రసంగించారు. బీజేపీ పదే పదే నెహ్రూను విమర్శించడంపైనా ప్రియాంక స్పందించారు. ‘‘ఎప్పుడూ గతం గురించి మాట్లాడుతూ, నెహ్రూను విమర్శించే వీరంతా ఇప్పుడేం చేస్తున్నారో చెప్పగలరా.. లేకపోతే ఇప్పుడు కూడా దేశాభివృద్ధి బాధ్యతను ఈ పాలకులు నెహ్రూకే వదిలేశారా’’ అని ఎద్దేవా చేశారు. ప్రియాంక ప్రసంగంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ ప్రశంసల వర్షం కురింపించారు. లోక్‌సభలో తన తొలి ప్రసంగం కంటే ప్రియాంక ప్రసంగమే బాగుందన్నారు. మరోవైపు, రాజ్యాంగంపై చర్చ సమయంలో ప్రధాని మోదీ సభలో లేకపోవడంపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీలను ముఖ్యంగా ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
వారు నేర్చుకున్నది అదే
అంతకుముందు రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్ కాంగ్రె్‌సపై తీవ్ర విమర్శలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించిందన్నారు. రాజ్యాంగం కంటే తమ అధికారమే గొప్పదని కాంగ్రెస్ భావిస్తుందని మండిపడ్డారు. ఆ పార్టీ దురుద్దేశపూర్వకంగా ఎన్నోసార్లు రాజ్యాంగానికి సవరణలు చేసిందన్నారు. ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ‘‘ఇటీవల విపక్ష నేతలు జేబులో రాజ్యాంగం పుస్తకాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు. వారు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే. తరతరాలుగా వారు రాజ్యాంగాన్ని తమ జేబులోని పుస్తకం అనుకుంటున్నారు’’ అని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన కొంతమందిని కావాలనే విస్మరించారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగంపై చర్చ శనివారం కూడా జరగనుంది. కాగా. భారత పార్లమెంట్‌పై 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమరులైన వారికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు నేతలు శుక్రవారం నివాళులర్పించారు.
మిమ్మల్ని ఎలా గౌరవించాలి?
నన్ను, మా పార్టీని అవమానిస్తున్నారు
రాజ్యసభ చైర్మన్‌ను ఉద్దేశించి ఖర్గే
న్యూఢిల్లీ, డిసెంబరు 13: రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో సభలో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొంది. చైర్మన్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. ‘నేను రైతు బిడ్డను. ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనంగా ఉండను, ఇప్పటికే నేను చాలా వరకు సహించాను’ అని ధన్‌ఖడ్ పేర్కొనగా.. ‘మీరు రైతు బిడ్డ అయితే.. నేను కూడా ఒక కూలీ కుమారుడిని!’ అని ఖర్గే పేర్కొన్నారు. ‘మీరు మా కాంగ్రె్‌సను, మా పార్టీ నేతలను అవమానిస్తున్నారు. మీ గొప్పలు వినేందుకు మేం ఇక్కడకు రాలేదు’ అని అన్నారు. చైర్మన్ అధికార పార్టీ ఎంపీలకే అధిక సమయం ఇస్తూ, బీజేపీ దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారని, విపక్ష సభ్యులను మాట్లాడనివ్వకుండా పక్షపాతం చూపుతున్నారని ఆరోపించారు. ఈ సమయంలో వాడీవేడి చర్చ మరింత తీవ్రంగా మారింది. ఒకానొక సమయంలో ‘నన్ను అవమానిస్తున్న మిమ్మల్ని.. నేను ఎలా గౌరవించగలను?’ అని ఖర్గే రాజ్యసభ చైర్మన్‌ను అడిగారు.