Share News

Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..

ABN , Publish Date - Jul 10 , 2024 | 02:46 PM

సివిల్ సర్వీసెస్ అధికారి అంటేనే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకై అన్నట్లుగా పని చేస్తూ ఉండాలి. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ప్రజలకు కష్టం వస్తే.. వెంటనే స్పందించే గుణం ఉండాలి.

Pooja Khedkar : ట్రైయినీ ఐఏఎస్‌పై బదిలీ వేటు..
trainee IAS Pooja Khedkar

ముంబై, జులై 10: సివిల్ సర్వీసెస్ అధికారి అంటేనే ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకై అన్నట్లుగా పని చేస్తూ ఉండాలి. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. ప్రజలకు కష్టం వస్తే.. వెంటనే స్పందించే గుణం ఉండాలి. అయితే ఐఏఎస్‌కు సెలక్టయి.. ట్రైనీ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఓ యువ ఐఏఎస్‌పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

పుణె అసిస్టెంట్ కలెక్టర్‌గా డాక్టర్ పూజా కేడ్కర్ విధులు నిర్వహిస్తుంది. ఆ క్రమంలో ఆమెకు ప్రైవేట్ కారును ప్రభుత్వం కేటాయించింది. ఆ కారుపై వీఐపీలు వినియోగించే రెడ్, బ్లూ బల్బులు ఏర్పాటు చేసుకుంది. ఇక కారు ముందు వీఐపీ నెంబర్ ప్లేట్‌తోపాటు మహారాష్ట్ర ప్రభుత్వమంటూ ప్లేట్‌ను సైతం తగిలించింది. మరోవైపు తనకు కలెక్టర్ కార్యాలయంలో అధికారిక చాంబర్ ఏర్పాటు చేయడంతోపాటు అందులో తగినంత సిబ్బందిని, ఓ కానిస్టేబుల్‌ను సైతం కేటాయించాలని సీనియర్ అధికారులను కోరింది. అక్కడితో ఆగకుండా.. ఇతర ఉన్నతాధికారులు కార్యాలయంలో లేని సమయంలో.. వారి చాంబర్లను సైతం వినియోగించుకోవడం ప్రారంభించింది.


దీంతో డాక్టర్ పూజా కేడ్కర్‌ వ్యవహారశైలిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో ఈ వ్యవహారంపై నివేదిక అందజేయాలని పుణె జిల్లా కలెకర్ట్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసి.. ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. దాంతో డాక్టర్ పూజా కెడ్కర్.. పుణె నుంచి వాసిమ్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే వాసిమ్‌లో పూజా కేడ్కర్ సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెకర్ట్‌గా విధులు నిర్వహిస్తారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. అయితే రూల్స్ ప్రకారం.. ట్రైయినీ కలెక్టర్‌గా విధులు నిర్వహించే వారికి ఈ సౌకర్యాలేమీ ఉండవు. గజిటెడ్ ఆపీసర్‌గా నియయించిన తర్వాత.. ప్రభుత్వ సౌకర్యాలన్నీ కల్పించబడతాయి.

డాక్టర్ పూజా కేడ్కర్.. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రొబిషన్ పిరియడ్‌లో భాగంగా ఆమె ప్రస్తుతం పుణె ట్రైయినీ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇంకోవైపు ఆమె తండ్రి గతంలో సివిల్ సర్వెంట్‌గా పని చేశారు. అయితే ఆయన సైతం తన కమార్తె చేసిన డిమాండ్లను అమలు చేయాలని పుణె కలెక్టర్ కార్యాలయంలోని ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఆర్టీఐ కార్యకర్త విజయ్ కుంబర్ సైతం స్పందించారు.


పూజా కేడ్కర్ తండ్రి తన ఎలక్షన్ అఫిడవిట్‌లో రూ. 40 కోట్ల ఆస్తులన్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన కుమార్తె ఓబిసీ రిజర్వేషన్‌ను ఉపయోగించుకొని ఐఏఎస్‌కు ఎంపికయ్యారన్నారు. అయితే పూజా కేడ్కర్‌కు పలు అనారోగ్య సమస్యలున్నాయన్నారు. అందుకే పలుమార్లు వైద్య పరీక్షలు నిర్వహించినా.. వాటిలో ఆమె పాల్గొలేదని వివరించారు. అయినా పూజా కేడ్కర్ ఐఏఎస్‌కు ఎలా ఎంపిక అయిందంటూ విజయ్ ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 03:16 PM