Kolkata: 75 మంది వైద్యుల మూకుమ్మడి రాజీనామాలకు రెడీ.. దీదీ దిగిరావాలని డిమాండ్
ABN , Publish Date - Oct 13 , 2024 | 03:50 PM
ట్రైనీ జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన పలువురు జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు.
కోల్‌కతా: ట్రైనీ జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటన వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బాధితురాలి కుటుంబానికి మద్దతుగా ఆర్జీ కర్ ఆసుపత్రికి చెందిన పలువురు జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్ష చేస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమించింది. నిరాహార దీక్ష చేస్తున్న బాధితులకు మద్దతు తెలపడానికి 75 మంది వైద్యులు ముందుకొచ్చారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని వారు హెచ్చరించారు. కళ్యాణి జేఎన్ఎంకు చెందిన 75 మంది సీనియర్ వైద్య బృందం నిరసనకారులకు మద్దతు తెలిపింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యులకు సంఘీభావంగా రాజీనామా చేయడానికి తామంతా సిద్ధమేనని వైద్యులు తెలిపారు. అక్టోబర్ 14 నుండి విధుల్లో పాల్గొనవద్దని నిర్ణయించుకున్నట్లు పశ్చిమ బెంగాల్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌కు ఇమెయిల్ ద్వారా తెలియజేశారు.
కోల్ కతా హత్యాచార ఘటన తమను మానసికంగా దెబ్బ తీసిందని.. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ వైద్యుల ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంపై వారు మండిపడుతున్నారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఘటనకు కారణమైన ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎన్‌ఎస్ నిగమ్‌ను వెంటనే తొలగించాలని, పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న అనేక మంది వైద్యులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి రాజీనామా లేఖలను సమర్పించారు. వైద్యుల సామూహిక రాజీనామాలు చెల్లవని, సర్వీస్ రూల్స్ ప్రకారం వ్యక్తిగతంగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ ఏడాది ఆగస్టులో ఆర్జీ కర్ ప్రభుత్వ కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై ఓ కామాంధుడు హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు చేశారు. సీఎం మమతా బెనర్జీ తమ డిమాండ్లను నెరవేర్చేందుకు హామీ ఇవ్వడంతో, 12 రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరవధిక నిరాహార దీక్ష చేసి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
RG Kar: నిరాహార దీక్షలో జూడాలు.. ఒకరి పరిస్థితి విషమం
Read Latest Telangana News and National News