Share News

Rahul Gandhi: కూటమి నుంచి నితీశ్ వైదొలగడానికి కారణం ఇదే.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Jan 30 , 2024 | 06:03 PM

‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ కూటిమికి షాకిస్తూ వైదొలగిన విషయం తెలిసిందే. ఎన్డీయే సారథ్యంలో బిహార్‌లో ఆయన సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఇండియా కూటమి నేతలు నితీశ్‌పై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Rahul Gandhi: కూటమి నుంచి నితీశ్ వైదొలగడానికి కారణం ఇదే.. రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన బిహార్ సీఎం నితీశ్ కుమార్.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ కూటిమికి షాకిస్తూ వైదొలగిన విషయం తెలిసిందే. ఎన్డీయే సారథ్యంలో బిహార్‌లో ఆయన సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే.. ఇండియా కూటమి నేతలు నితీశ్‌పై తారాస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అతను పిరికివాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఈ అంశంపై మౌనం వీడారు. ఇండియా కూటమి నుంచి నితీశ్ వైదొలగడానికి గల కారణం ఏంటో చెప్పారు. బీహార్‌లో నిర్వహించిన కుల గణన కారణంగానే ఆయన కూటమి నుంచి నిష్క్రమించారని స్పష్టం చేశారు.


‘‘బిహార్‌లో కుల గణన నిర్వహించాలని నేను నితీశ్ కుమార్‌కు సూటిగా చెప్పాను. ఆర్జేడీతో కలిసి కాంగ్రెస్ పార్టీ.. ఈ సర్వే నిర్వహించాల్సిందేనని నితీశ్‌పై ఒత్తిడి తెచ్చాం. అయితే.. ఈ విషయంపై బీజేపీ భయపడి, ఈ ప్రణాళికను వ్యతిరేకించింది. నిజాలు చెప్పడం ఇష్టం లేక, బిహార్‌లో కుల గణన జరపాలని ఆ పార్టీ కోరుకోలేదు. ఇక్కడే నితీశ్ ఇరుక్కుపోయారు. ఏం చేయాలో పాలుపోని సమయంలో.. కూటమి నుంచి నిష్క్రమించేలా బీజేపీ ఆయన కోసం వెనుక నుంచి తలుపులు తెరిచింది’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. బిహార్‌లో రాజకీయ పరిస్థితులు బాగోలేవని నితీశ్ చెప్పారని.. ఆయన ఒత్తిడికి గురై ఈ యూటర్న్ తీసుకున్నారని అన్నారు. ఏదేమైనా.. ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడం ‘ఇండియా’ కూటమి బాధ్యత అని, దీనికి నితీశ్ కుమార్ అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. తాను చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ప్రస్తుతం బిహార్‌లో పర్యటిస్తున్న ఆయన.. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో.. నితీశ్ కుమార్ పదే పదే ప్రమాణస్వీకారం చేయడంపై రాహుల్ గాంధీ ఒక జోక్ పేల్చారు. ‘‘రాజ్‌భవన్‌లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నితీశ్ కుమార్ వెంటనే బయలుదేరారు. అయితే కారెక్కిన తర్వాత తన శాలువాని రాజ్‌భవన్‌లోనే మర్చిపోయానని ఆయన గ్రహించారు. దీంతో.. ఆ శాలువాని తీసుకుని రావాల్సిందిగా డ్రైవర్‌ని పంపించారు. అలా డ్రైవర్ రావడం చూసి.. ‘నువ్వు ఇంత త్వరగా మళ్లీ ఎందుకు తిరిగొచ్చావ్?’ అని ఆశ్చర్యానికి గురవుతూ గవర్నర్ చెప్పారు’’ అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. అంటే.. డ్రైవర్ రావడం చూసి నితీశ్ మళ్లీ పార్టీ మారుతారేమోనని గవర్నర్ కంగారుపడ్డారంటూ రాహుల్ జోక్ చేశారు.

Updated Date - Jan 30 , 2024 | 06:03 PM