Share News

Rajnath Singh: సిక్కులు, రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు

ABN , Publish Date - Sep 11 , 2024 | 06:14 PM

భారతదేశ సంస్కృతి పరిరక్షణలో సిక్కుల పాత్రను యావద్దేశం గుర్తించి, గౌరవిస్తుంటే వారి గురించి తప్పుడు ప్రకటనలు చేయడం విపక్ష నేతగా రాహుల్‌కు తగదని రాజ్‌నాథ్ హితవు పలికారు.

Rajnath Singh: సిక్కులు, రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)విదేశీ పర్యటనలో భాగంగా వర్జీనియాలో చేసిన ప్రసంగంలో సిక్కు మతస్థులు, రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలు నిరాధారమని, తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, సిగ్గుచేటని అన్నారు. మొహబ్బత్ కీ దుకాణ్ నడుపుతున్నామని చెబుతున్న రాహుల్ ఇందుకు భిన్నంగా అబద్ధాల దుకాణం తెరిచారని వ్యంగ్యోక్తులు గుప్పించారు.


''లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో ప్రజలను తప్పుదారి పట్టించేలా అవాస్తవాలు చెబుతుండటం సిగ్గుచేటు. ఇది దేశ ప్రతిష్టను దెబ్బతీయడమే. భారతదేశంలోని సిక్కులను గురుద్వారాలలో తలపాగాలు ధరించేందుకు అనుమతించడం లేదని ఆయన చెబుతున్నారు. మత విధానాలను ఆచరించకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు. ఇది పూర్తిగా నిరాధారం, ఇందులో నిజం ఎంతమాత్రం లేదు'' అని రాజ్‌నాథ్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతదేశ సంస్కృతి పరిరక్షణలో సిక్కుల పాత్రను యావద్దేశం గుర్తించి, గౌరవిస్తుంటే వారి గురించి తప్పుడు ప్రకటనలు చేయడం విపక్ష నేతగా రాహుల్‌కు తగదని రాజ్‌నాథ్ హితవు పలికారు.

Congress vs BSP: రాహుల్ రిజర్వేషన్ వ్యాఖ్యలపై మాయవతి ఫైర్..


రిజర్వేషన్లపై..

ఎన్డీయే ప్రభుత్వం రిజర్వేషన్లను రద్దు చేయాలని అనుకుంటోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం మన ప్రధాని రిజర్వేషన్ సిస్టమ్‌ను పటిష్టం చేశారని చెప్పారు. ఇండియా-చైనా సరిహద్దు వివాదంపై వాస్తవాలను వక్రీకరించేలా అమెరికా గడ్డపై రాహుల్ నిరాధార వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తద్వారా ప్రేమ దుకాణం నడుపుతామని చెప్పి అబద్ధాల దుకాణాన్ని రాహుల్ ప్రారంభించినట్టు కనిపిస్తోందని ఆక్షేపించారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయకుండా రాహుల్ సంయమనం పాటించాలని సూచించారు.


Read More Nationa News and Latest Telugu News

Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..

Updated Date - Sep 11 , 2024 | 06:14 PM