Share News

Rajya Sabha : జయాబచ్చన్‌ వర్సెస్‌ చైర్మన్‌

ABN , Publish Date - Aug 10 , 2024 | 04:57 AM

మహిళా సభ్యులతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్‌ నటి జయాబచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.

 Rajya Sabha : జయాబచ్చన్‌ వర్సెస్‌ చైర్మన్‌

  • మహిళా సభ్యుల సంబోధన పట్ల రాజ్యసభలో వాడీవేడి సంవాదం

  • మహిళలతో మీ మాటతీరు బాలేదు

  • చైర్‌ను ఉద్దేశించి జయ ఫిర్యాదు

  • సభామర్యాదలను తెలుసుకోండి: ధన్‌ఖడ్‌

  • జయకు మద్దతుగా విపక్షాల వాకౌట్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 9: మహిళా సభ్యులతో చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్‌ నటి జయాబచ్చన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది. నేరుగా చైర్మన్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం, ప్రతిగా చైర్మన్‌ స్పందించడం, తిరిగి జయ మాట్లాడటం.. ఇలా పెద్దల సభలో తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం రాజుకుంది.

చైర్‌ తనకు క్షమాపణలు చెప్పాలని జయ గట్టిగా డిమాండ్‌ చేశారు. జయాబచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నేతృత్వంలో రాజ్యసభలోని విపక్ష పార్టీల సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు. గత సోమవారం రాజ్యసభలో చైర్మన్‌ తనను ‘జయా అమితాబ్‌ బచ్చన్‌’ అంటూ సంబోధించడాన్ని ఆమె అభ్యంతరపెట్టారు.

‘జయాబచ్చన్‌ అనండి చాలు. నా భర్త పేరును జోడించి పిలవడం ఒక మహిళగా నాకు ఇబ్బందిగా ఉంది. మాకు సొంత అస్తిత్వం లేదన్నట్టు మీ సంబోధన ఉంది’’ అని తేల్చిచెప్పారు. ఇదే క్రమంలో శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలు మొదలైన కొద్దిసేపటికి చైర్మన్‌ జగదీప్‌ ధనఖడ్‌పై జయాబచ్చన్‌ మరోసారి సభలో ఫిర్యాదు చేశారు. ‘మీ మాటతీరు బాగాలేదు’ అని ఆమె అన్నారు. దీనిపై చైర్మన్‌ తీవ్రంగా స్పందించారు.

‘‘మీరు ప్రముఖ నటి కావచ్చు. కానీ, సభా మర్యాదలను మీరు అర్థం చేసుకోవాలి’’ అని సూచించారు. దీనిపై జయ తిరిగి స్పందిస్తూ... ‘‘సర్‌! నేను జయా అమితాబ్‌ బచ్చన్‌ను. నేను నటిని. బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెషన్‌ (వ్యక్తీకరణ) నాకు అర్థం అవుతాయి. మీ మాట తీరు సబబుగా లేదు.


ఈ మాట అన్నందుకు నన్ను మన్నించండి’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి చైర్మన్‌ స్పందిస్తూ.. ‘‘మీరు గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు. నటి విషయం డైరెక్టర్‌కు సంబంధించింది. మీకు ఇవన్నీ వేలు పట్టుకుని నేర్పించాల్సిన అవసరం లేదు. లేదు.. లేదు.. ఇక ఆపండి..’’ అంటూ ఆమె వైపు చేతులు ఊపారు.

అనంతరం జయాబచ్చన్‌ సహా సభలో విపక్ష సభ్యులంతా వాకౌట్‌ చేశారు. పార్లమెంటు వెలుపల మిగతా రాజ్యసభ సభ్యులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘సభలో చైర్మన్‌ అన్‌ పార్లమెంటరీ భాషను వాడుతున్నారు. ‘న్యూసెన్స్‌’, ‘మీరు ప్రముఖులైతే కావచ్చుగానీ నేను అవేవీ పట్టించుకోను’ అని సభ్యులతో అంటున్నారు. సభలో మహిళా సభ్యులతో మాట్లాడే తీరు ఇదేనా? ఇది అవమానకరం’’ అని జయాబచ్చన్‌ అన్నారు.

చైర్‌ నుంచి క్షమాపణను ఆమె డిమాండ్‌ చేశారు. కాగా, రాజ్యసభలో అమర్యాదకరంగా, అత్యంత అభ్యంతరకర రీతిలో విపక్ష సభ్యుల ప్రవర్తించారని బీజేపీ మండిపడింది. ‘దేశాన్ని బలహీనపరచాలని విపక్షాలు చూస్తున్నాయి. ఇందుకుగాను అవి క్షమాపణలు చెప్పాల్సిందే’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి నడ్డా స్పష్టం చేశారు.

Updated Date - Aug 10 , 2024 | 04:57 AM