Ayodhya Ram Temple: రామాలయం నిర్మాణానికి శుభం కార్డు... నిర్మాణ కమిటీ చైర్మన్ సంచలన ప్రకటన
ABN , Publish Date - Jan 17 , 2024 | 07:51 PM
అయోధ్యలో రామ్ లల్లా ఆలయ నిర్మాణం పూర్తయిందని రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా బుధవారంనాడు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిశ్రా తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రామలల్లా ఆలయంలో గర్భగుడి ఉందని, అది పూర్తయిందని వెల్లడించారు.
న్యూఢిల్లీ: అయోధ్య (Ayodhya)లో రామ్ లల్లా (Ram Lalla) ఆలయ నిర్మాణం పూర్తయిందని రామమందిరం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా (Nripendra Mishra) బుధవారంనాడు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగుతోందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మిశ్రా తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రామలల్లా ఆలయంలో గర్భగుడి (Garbhagriha) ఉందని, అది పూర్తయిందని వెల్లడించారు.
''మందిరం పూర్తయింది. గర్భగుడి, ఐదు మండపాలతో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆలయం ఉంది. ఆ ఆలయం పూర్తయింది. మొదటి అంతస్తు నిర్మాణంలో ఉంది. అందులో రామ్ దర్బార్ ఉంది. రెండో అంతస్తు కేవలం అనుష్ఠాన్ కోసం ఉంది. అందులో వివిధ రకాల యోగాలు, అనుష్టానాలు జరుగుతాయి'' అని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మిశ్రా తెలిపారు.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠకు ఈనెల 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు శుభముహూర్తం నిశ్చయమైందని మిశ్రా చెప్పారు. ప్రార్థనలు, ప్రతిష్ఠాపనకు ముందు జరిగే కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయని, రామ్‌లల్లా విగ్రహాన్ని గురువారం ఉదయం గర్భగుడిలోకి తీసుకురావచ్చని తెలిపారు. ముహూర్తం సమయానికి ప్రాణప్రతిష్ట జరుగుతుందని చెప్పారు.
గర్భగుడిలో ప్రతిష్ఠించడానికి మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన నల్లరాతి రామ్‌లల్లా విగ్రహం ఎంపికైంది. మంగళవారంనాడు ప్రారంభమైన రామ్‌లల్లా ప్రతిష్ఠాపన ఉత్సవాలు ఏడురోజుల పాటు జరుగుతాయి. వేలాది మంది వీఐపీ అతిథులకు రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు అందజేసింది. కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఆహ్వానాలు, గిఫ్టులు ఇచ్చేందుకు ట్రస్టు తగిన ఏర్పాట్లు చేస్తోంది. అతిథులకు మోతిచూర్ లడ్డూలు ప్రసాదంగా పంపిణీ చేయనుంది. దేశవ్యాప్తంగా 11,000 మందికి పైగా అతిథులకు ట్రస్టు ఆహ్వానాలు పంపింది.