Rameswaram: రామేశ్వరంలో దంచికొట్టిన వర్షం
ABN , Publish Date - Jan 11 , 2024 | 10:16 AM
రామేశ్వరం(Rameswaram)లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వేకువజాము వరకు భారీగా వర్షాలు కురిశాయి. వర్షాల వల్ల రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
- చేపలవేటకు వెళ్లని జాలర్లు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రామేశ్వరం(Rameswaram)లో మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం వేకువజాము వరకు భారీగా వర్షాలు కురిశాయి. వర్షాల వల్ల రహదారులు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడ్డారు. రామనాథపురం జిల్లా రామేశ్వరం, తంగచ్చిమఠం, పాంబన్, మండపం తదితర ప్రాంతాల్లో మంగళవారం వేకువజామునుంచి బుధవారం ఉదయం వరకూ చెదురుముదురుగా వర్షాలు కురిశాయి. రామేశ్వరంలో పెనుగాలులతో భారీగా వర్షం కురిసింది. రామేశ్వరం రామనాఽథస్వామి ఆలయ ప్రాంతం, మునియసామి గుడి వీధి, మార్కెట్, బస్‌స్టేషన్ తదితర ప్రాంతాల్లో రహదారులపై మోకాలి లోతున నీరు ప్రవహించింది. దీంతో వాహనాలు నత్తనడక నడిచాయి. బుధవారం ఉదయం రామేశ్వరం తీరంలో గంటకు 40 నుంచి 55 కి.మీల వేగంతో పెనుగాలులు వీయడంతో జాలర్లు చేపల వేట వెళ్లకూడదంటూ జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో రామేశ్వరం, పాంబన్, మండపం, కీళ్‌కరై, వాలినోక్కం, మక్రయూరు, దేవీపట్టినం, చోళియంకుడి, తొండి తదితర రేవులలో 1600కు పైగా మరపడవలు, 6 వేలకు పైగా నాటుపడవలను తీరం వద్దే లంగేరేసి ఉంచారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు కడలాడిలో 41 మి.మీ.లు, వాలినోక్కంలో 53 మి.మీ.లు, కముదిలో 53 మి.మీ.లు, పల్లమోర్‌కుళంలో 12 మి.మీ.లు, ముదుగళత్తూరులో 25 మి.మీ.లు, పరమకుడిలో 28మి.మీ.లు, ఆర్‌ఎస్ మంగళంలో 21మి.మీ.లు, మండపంలో 45 మి.మీల చొప్పన వర్షపాతం నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.