సీ ఎడ్జ్ టెక్నాలజీస్‌పై రాన్సమ్ వేర్ దాడి.. దేశ వ్యాప్తంగా 300 బ్యాంకు సేవల నిలిపివేత
ABN , Publish Date - Aug 01 , 2024 | 12:59 PM
భారత్‌లోని పలు చిన్న బ్యాంకుల టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై రాన్సమ్ వేర్ దాడి జరిగింది. దీంతో 300 చిన్న భారతీయ స్థానిక బ్యాంకుల్లోని చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: భారత్‌లోని పలు చిన్న బ్యాంకుల టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌పై రాన్సమ్ వేర్ దాడి జరిగింది. దీంతో 300 చిన్న భారతీయ స్థానిక బ్యాంకుల్లోని చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా చిన్న బ్యాంకులకు బ్యాంకింగ్ టెక్నాలజీ సిస్టమ్‌లను అందించే సీ-ఎడ్జ్ టెక్నాలజీస్‌పై దాడి ప్రభావం చూపనుందని సమాచారం. ఈ విషయమై సీ-ఎడ్జ్ టెక్నాలజీస్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఆర్‌బీఐ కూడా ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఈ విషయమై భారత్‌లో చెల్లింపుల వ్యవస్థలను నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బుధవారం కీలక ప్రకటన చేసింది.
రిటైల్ చెల్లింపుల వ్యవస్థ యాక్సెస్‌ను తొలగించినట్టు సీ - ఎడ్జ్ టెక్నాలజీస్ వెల్లడించింది. కాబట్టి ప్రస్తుతానికి సీఎడ్జ్ బ్యాంకుల కస్టమర్లు ఈ ఐసోలేషన్ సమయంలో చెల్లింపు వ్యవస్థలను వినియోగించుకోలేరని తెలిపింది. దాదాపు దేశంలోని 300 చిన్న బ్యాంకులకు రిటైల్ చెల్లింపు వ్యవస్థలను తాత్కాలికంగా అందుబాటులో లేకుండా చేసి సమస్య మరింత జఠిలం కాకుండా అడ్డుకున్నారు. అయితే ఈ వాటా భారత డిజిటల్ చెల్లింపుల్లో కేవలం 0.5 శాతమేనట. భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 1500 సహకార, ప్రాంతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువగా పెద్ద నగరాల వెలుపల మాత్రమే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ కాదు.. వీటిలో కొన్ని బ్యాంకులు మాత్రమే ప్రభావితమయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సైబర్ దాడి మరింత వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఎన్‌పీసీఐ ఆడిట్‌ను నిర్వహిస్తోందని సమాచారం. బ్యాంకులపై సైబర్ దాడి జరిగే అవకాశం ఉన్నట్టు రిజర్వ్ బ్యాంకు, భారత సైబర్ భద్రతా విభాగాలు కొన్ని వారాల క్రితమే వివిధ బ్యాంకులను హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయితే పునరుద్ధరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, అవసరమైన సెక్యూరిటీ రివ్యూ జరుపుతున్నట్లు చెప్పింది. చెల్లింపులు నిలిచిపోయిన బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని ఎన్‌పీసీఐ తెలిపింది.