Share News

Reasi attack: బస్సుపై ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం

ABN , Publish Date - Jun 19 , 2024 | 06:15 PM

రియాసీ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడికి పాల్పడిన తీవ్రవాదులకు ఆయుధాలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.

Reasi attack: బస్సుపై ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం

జమ్ము కాశ్మీర్, జూన్ 19: రియాసీ ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడికి పాల్పడిన తీవ్రవాదులకు ఆయుధాలు సమకూర్చిన వ్యక్తిని పోలీసులు బుధవారం రాజౌరీలో అరెస్ట్ చేశారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి 50 మంది అనుమానితులను ఇటీవల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న ముగ్గురు అనుమానితుల ఊహాచిత్రాలను ఇప్పటికే పోలీసులు విడుదల చేశారు. వీరి సమాచారం అందిస్తే.. రూ.20 లక్షల రివార్డు అందజేస్తామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మరోవైపు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్పగించింది.


ఈ ఏడాది మే 4వ తేదీన పూంచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయి లక్ష్యంగా చేసుకొని దాడికి తెగబడిన ముగ్గురు పాకిస్థానీ తీవ్రవాదులకు ఈ ఉగ్రదాడిలో సంబంధం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో సదరు ముగ్గురు తీవ్రవాదుల ఊహచిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే రియాసీ ఉగ్రదాడికి తామే బాధ్యులమని నిషేధిత లష్కర్ ఈ తోయిబా సంస్థకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆ ప్రకటనను ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉపసంహరించుకుంది. ఇక ఇటీవల న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జమ్ము కాశ్మీర్‌లో శాంతి భద్రతలు, వరుస ఉగ్రదాడులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉగ్రవాదులను అణిచివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.


జూన్ 9వ తేదీన జమ్ము కాశ్మీర్‌లోని శివ ఖోరి నుంచి కాట్రాలోని శ్రీ మాత వైష్ణోదేవి ఆలయానికి యాత్రికులతో వెళ్తున్న బస్సుపై రియాసీ జిల్లాలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో డ్రైవర్ బస్సు వేగాన్ని పెంచాడు. దాంతో బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన వారు. ఇంకోవైపు న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీతోపాటు ఆయన కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే.. ఈ బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం గమనార్హం.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 06:16 PM