Share News

Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం

ABN , Publish Date - Dec 20 , 2024 | 03:49 AM

శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్‌ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది.

Sabarimala: శబరిమలలో మండల పూజకు సిద్ధం

22న అరన్ములలో తంగఅంకి కార్యక్రమం

25న శబరిమలకు రథం చేరిక

26న మండల పూజ

శబరిమల, డిసెంబరు 19: శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబరు 16న ప్రారంభమైన మండల పూజ సీజన్‌ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మండల పూజల్లో అత్యంత కీలకమైన ఘట్టం తంగఅంకి కార్యక్రమం. అరన్ములలోని పార్థసారథి ఆలయం నుంచి ఈ నెల 22న ఉదయం 7గంటలకు ప్రారంభంకానున్న తంగఅంకి రథం.. 25న సాయంత్రానికి శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటుంది. ఇక గురువారం నుంచి భక్తుల రద్దీ పెరిగిందని ట్రావెన్‌కోర్‌ దేవొస్వం బోర్డు(టీడీబీ) అధికారులు తెలిపారు. గురువారం శరణ్‌గుత్తి నుంచి పంపావైపు కిలోమీటరు దూరంలో ఉన్న ట్రీక్లస్టర్‌ వరకు స్వాములు క్యూలైన్‌లో నిలబడ్డారని, రద్దీని నియంత్రించడానికి మారకుట్టం వద్ద క్యూలైన్‌ను 2-3 గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో కేరళీయులు కూడా మండలపూజకు వచ్చే అవకాశాలున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అరుణ్‌ నాయర్‌ నేతృత్వంలో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ‘‘ఎక్కడికక్కడ ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను మోహరిస్తాం.

అదనపు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తాం. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో డిజిటల్‌ డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేశాం. వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం నడపండల్‌ వద్ద ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసి వారికి శీఘ్ర దర్శనానికి అనుమతిస్తున్నాం’’ అని ఆయన వివరించారు. కాగా అటవీ మార్గంలో విష కీటకాల వల్ల భక్తులకు ప్రమాదం జరగకూడదనే ఉద్దేశంతో.. నల్లత్రాచు, త్రాచు, రక్తపింజర వంటి పాములను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు మోహరించాయి. పంపానదిలో కూడా పాముల బెడద ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. తిరువనంతపురానికి చెందిన బిజోయ్‌ అనే వ్యక్తి కుమారులు.. అభినవ్‌, అద్వైత్‌లు సన్నిధానం వద్ద 504 రూబిక్స్‌ క్యూబ్‌లతో అయ్యప్ప ప్రతిరూపాన్ని రూపొందించారు. ఈ చిత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిన్నారులిద్దరూ అయ్యప్ప దీక్ష తీసుకుని.. మొదటిసారి శబరిమలకు రావడం గమనార్హం..!’

Updated Date - Dec 20 , 2024 | 03:49 AM