CBI : హత్యాచారం చేసింది సంజయ్ రాయే!
ABN , Publish Date - Oct 08 , 2024 | 03:30 AM
కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.
కోల్‌కతా వైద్యురాలి కేసులో సీబీఐచార్జిషీటు
సీసీ టీవీలోనూ కదలికలు నిక్షిప్తం
బాధితురాలి గోళ్లలో నిందితుడి రక్తం, చర్మం.. పక్కాగా సాక్ష్యాధారాలు
గ్యాంగ్‌రేప్ ప్రస్తావన చేయని సీబీఐ
నిందితుడు ఒక్కడే నేరానికి పాల్పడ్డాడని వెల్లడి
కోల్‌కతా, అక్టోబరు 7 : కోల్‌కతా ఆర్జీ కార్ ఆస్పత్రి, వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్(33)పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది. స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్ హాల్‌లో ట్రెయినీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే చార్జిషీటులో గ్యాంగ్‌రేప్ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లూ పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్‌మెంట్లను సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్‌నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాల సమాచారం.
కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, ఇది గ్యాంగ్‌రేపా..., అనుమానితులు ఇంకా ఉన్నారా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. పోస్టుమార్టమ్ సమయంలో వైద్యురాలి మృతదేహంలో ఎక్కువ పరిమాణంలో వీర్యం లభించడం గ్యాంగ్‌రేప్ అనుమానాలకు దారితీసింది. కాగా కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశాక తానే ఈ నేరానికి పాల్పడ్డానని తొలుత అంగీకరించాడు. తర్వాత పాలీగ్రాఫ్ పరీక్ష చేస్తుండగా తాను చేయలేదని అడ్డం తిరిగాడు. అయితే వైద్యురాలి మృతదేహం దగ్గర లభ్యమైన బ్లూటూత్ పరికరం రాయ్‌ని పట్టించింది. అలాగే సెమినార్ హాల్ ఉన్న ఆర్జీ కార్ ఆస్పత్రి మూడో ఫ్లోర్‌లో రాయ్ సంచరించడం సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది. అతడు తెల్లవారుజామున 4 గంటలకు అక్కడికి వచ్చి 40 నిమిషాల తర్వాత తిరిగి వెళ్లాడు. బాధితురాలి గోళ్లలో లభ్యమైన రక్తం, చర్మం రాయ్ డీఎన్‌ఏతో సరిపోలాయి.