Share News

Supreme Court: అన్నామలైకి సుప్రీం ఊరట.. విద్వేష ప్రసంగం విచారణపై స్టే పొడిగింపు

ABN , Publish Date - Apr 29 , 2024 | 08:38 PM

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలైకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2022లో క్రిస్టియన్లపై అన్నామలై విద్వేష ప్రసంగం చేశారంటూ దాఖలైన క్రిమినల్ కేసు విచారణపై గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను అత్యున్నత న్యాయస్థానం సోవారంనాడు పొడిగించింది. సెప్టెంబర్ 9వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది.

Supreme Court: అన్నామలైకి సుప్రీం ఊరట.. విద్వేష ప్రసంగం విచారణపై స్టే పొడిగింపు

న్యూఢిల్లీ: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై (Annamalia)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. 2022లో క్రిస్టియన్లపై అన్నామలై విద్వేష ప్రసంగం చేశారంటూ దాఖలైన క్రిమినల్ కేసు విచారణపై గతంలో ఇచ్చిన తాత్కాలిక స్టేను అత్యున్నత న్యాయస్థానం సోవారంనాడు పొడిగించింది. సెప్టెంబర్ 9వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. ఫిర్యాదుదారు ఆరు వారాల్లోగా తన స్పందన తెలియజేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అన్నామలైపై దాఖలైన క్రిమినల్ కేసు ప్రొసీడింగ్స్‌పై ఫిబ్రవరి 26న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.

Amit Shah: అమిత్‌షాకు తృటిలో తప్పిన హెలికాప్టర్ ప్రమాదం


అన్నామలై 2022 అక్టోబర్ 22న దీపావళికి రెండు రోజుల ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్రిస్టియన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదుదారు వి.పీయూష్ ఆరోపణగా ఉంది. ఈ కేసులో తనకు జారీ అయిన సమన్లను కొట్టివేయాలంటూ అన్నామలై చేసిన విజ్ఞప్తిని మద్రాసు హైకోర్టు కొట్టింది. దీంతో హైకోర్టు తీర్పును గత ఫిబ్రవరి 8న సుప్రీంకోర్టులో అన్నామలై సవాలు చేశారు. అంతర్జాతీయ నిధులు అందుకుంటున్న ఒక ఎన్జీవో హిందువులను బాణసంచా కాల్చకుండా అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తోందని 'యూట్యూబ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నామలై వ్యాఖ్యానించారు. దీనిపై ట్రయిల్ కోర్టులో పీయూష్ పిటిషన్ వేశారు. విచారణ కోర్టు జారీ చేసిన సమన్లను అన్నామలై పైకోర్టులో సవాలు చేశారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని, ఆవేదనతో చేసినవని, తాను వ్యాఖ్యలు చేసిన సమయం కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. తాను ఇంటర్వ్యూ ఇచ్చిన 400 రోజుల తర్వాతే పిటిషన్ దాఖలైందని, ఈ మధ్య కాలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని అన్నారు. అయితే ఆయన వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. అన్నామలై ఒక కీలక పొజిషన్‌లో ఉంటూ చేసిన వ్యాఖ్యలకు విలువ ఉంటుందని, లక్షిత గ్రూపులపై మానసికంగా ప్రభావం చూపుతుందని హైకోర్టు నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేసింది.

Read National News And Telugu News

Updated Date - Apr 29 , 2024 | 08:38 PM