Madras High Court: హిందూ ఆలయాల్లోకి అన్య మతస్థుల ప్రవేశంపై హైకోర్టు సంచలన తీర్పు..
ABN , Publish Date - Jan 31 , 2024 | 12:55 PM
హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది.
చెన్నై: హిందూ ఆలయాల్లోకి ఇతర మతస్థుల ప్రవేశంపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఇక మీదట తమిళనాడులోని అన్ని హిందూ దేవాలయాల్లోకి అన్య మతస్థులను కోడిమారం (ధ్వజస్తంభం) దాటి అనుమతించరాదని తెలిపింది. అనుమతి నిరాకరణకు సంబంధించిన బోర్డులను సైతం ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా హిందువులకు కూడా తమ మతం, వృత్తిని అభ్యసించే ప్రాథమిక హక్కు ఉందని పేర్కొంది.
అరుల్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయంతో పాటు ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ డి సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మధురై బెంచ్.. అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ అన్ని ఆలయాల ప్రవేశ ద్వారాల వద్ద డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఈ పిటిషన్లో ప్రతివాదులుగా తమిళనాడు ప్రభుత్వం తరఫున పర్యాటక, సాంస్కృతిక, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పళని ఆలయ కార్యనిర్వాహక అధికారి, హిందూ మత, దర్మాదాయ శాఖ (HR&CE)ని చేర్చింది.తమిళనాడులోని హిందూ ఆలయాలను హెచ్ఆర్సీఈ విభాగం పర్యవేక్షిస్తోంది.