Sharad Pawar: ఇండియా కూటమి ‘పీఎం ఫేస్’.. అవసరం లేదంటూ శరద్ పవార్ సంచలనం
ABN , Publish Date - Jan 14 , 2024 | 04:14 PM
ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ‘ప్రధాని అభ్యర్థి ఎవరు’ అనే ప్రశ్న హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పటికే కూటమిలోని ప్రధాన అభ్యర్థులు.. ఎన్నికలయ్యాకే ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చాలాసార్లు..
Sharad Pawar: ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ‘ప్రధాని అభ్యర్థి ఎవరు’ అనే ప్రశ్న హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఇప్పటికే కూటమిలోని ప్రధాన అభ్యర్థులు.. ఎన్నికలయ్యాకే ఆ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చాలాసార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ.. ‘పీఎం అభ్యర్థి’ అంశంపై కూటమిలో వివాదం నెలకొందని, అభ్యర్థుల మధ్య సఖ్యత కుదరడం లేదని రూమర్లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరోసారి అలాంటి ప్రచారమే తెరమీదకి రావడంతో.. అందులో ఏమాత్రం వాస్తవం లేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ క్లారిటీ ఇచ్చారు. కన్వీనర్ నియామకానికి సంబంధించి సభ్యుల మధ్య వివాదం లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ‘పీఎం ఫేస్’ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
‘‘లోక్‌సభ ఎన్నికల టైంలో ఓట్లు అడిగేందుకు ‘పీఎం ఫేస్’ అవసరం లేదు. ఎన్నికల తర్వాత నేతను ఎంపిక చేస్తాం. ప్రత్యామ్నాయం కల్పిస్తామన్న విశ్వాసం ఉంది. 1977లో కూడా మొదట మొరార్జీ దేశాయ్‌ను ప్రతిపక్షాలు ప్రధానమంత్రి పదవికి అభ్యర్థిగా ప్రకటించలేదు. ఇప్పుడు అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి ఏకతాటిపైకి రావడం సానుకూల పరిణామం. కన్వీనర్ నియామకానికి సంబంధించి ఇండియా కూటమి సభ్యుల మధ్య ఎలాంటి వివాదం లేదు’’ అని శరద్ పవార్ చెప్పుకొచ్చారు. శనివారం ‘ఇండియా కూటమి’ వర్చువల్ సమావేశం జరిగిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల గురించి కూడా ఎలాంటి చర్చ జరగలేదని.. సీట్ల పంపకంపై ఇంకా చర్చలు జరగనున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ స్థానాలకు సంబంధించి సీట్ల పంపకంపై చర్చ జరిగిందని, ఇది ఖరారయ్యాక ప్రకటన చేస్తామని తెలిపారు. సంబంధిత కార్యక్రమాలు, విధానాలపై చర్చించామని చెప్పారు.
ఇదిలావుండగా.. ఈ వర్చువల్ సమావేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును కన్వీనర్ పదవికి శరద్ పవార్ సూచించినట్లు తెలిసింది. అయితే.. ఇప్పుడే ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని, పార్టీ ముఖ్య నేతలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నితీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. అలాగే.. ఈ సమావేశంలో పొత్తుకు సంబంధించిన పలు అంశాలు, ఏప్రిల్-మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల సన్నాహాలపై కూటమి నేతలు చర్చించారు. మరోవైపు.. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, కాకపోతే నిర్మాణం పూర్తవ్వని దేవాలయంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం వెనుక రాజకీయ ఉద్దేశ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని శరద్ పవార్ చెప్పుకొచ్చారు.