Trinamool Congress: ఈవీఎంలపై ఆరోపణలు చేస్తే సరిపోదు, నిరూపించాలి: టీఎంసీ
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:43 PM
ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్నలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ అన్నారు.

న్యూఢిల్లీ: ఈవీఎంలపై దుర్వినియోగంపై 'ఇండియా' (INDIA) కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ నిరంతర విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఆ ఆరోపణలపై కూటమి భాగస్వామి పార్టీల నుంచి వ్యతిరేకతలు సైతం కొనసాగుతున్నాయి. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ అస్థిరతతో ఉందంటూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆదివారంనాడు వ్యాఖ్యానించగా, తాజాగా ఆ వాదనకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) వంతపాడింది. ఈవీఎంలపై లేవనెత్తుతున్న ప్రశ్నలను టీఎంసీ తోసిపుచ్చింది. ఈవీఎంలకు హ్యాక్ చేయవచ్చని చెబుతున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో నిరూపించి చూపించాలని ఆ పార్టీ ఎంపీ, ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) అన్నారు.
Yogi Adityanath: రాళ్లు రువ్విందెవరు? వాళ్లను విడిచిపెట్టకూడదు.. సంభాల్ హింసపై యోగి నిప్పులు
''ఈవీఎంలపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాంటిదే ఉంటే వాళ్లు నేరుగా ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి ఈవీఎంలు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో ప్రదర్శించి చూపించాలి. ఈవీఎంల రాండమైజేషన్, మ్యాక్ పోల్స్, కౌంటింగ్ సమయంలో సక్రమంగా పని జరుగుతున్నప్పుడు హ్యాకింగ్ ఆరోపణల్లో పస ఉందని నేను అనుకోవడం లేదు'' అని అభిషేక్ బెనర్జీ అన్నారు. హ్యాకింగ్ ఆరోపపణలు చేసేవారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో కూడా చూపించాలని, అలా కానప్పుడు యాదృచ్ఛికంగా ప్రకటనలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆలస్యంగానైనా నిజం గ్రహించారు: సతీష్ చంద్ర డూబే
ఈవీఎంల హ్యాకింగ్ చేయవచ్చనే ఆరోపణలు చేస్తున్న వారు ఎలా హ్యాకింగ్ చేయవచ్చో ప్రదర్శించి చూపించాలంటూ అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి సతీష్ చంద్ర డూబే వెంటనే స్పందించారు. ఆలస్యంగానైనా టీఎంసీ నేత నిజాన్ని గ్రహించారని అన్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్, జార్ఖాండ్‌లో ఎన్నికలు జరిగాయని, జమ్మూకశ్మీర్‌లో గెలిచిన పార్టీ 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉందని, అప్పుడు ఈవీఎంలపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదని అన్నారు. జార్ఖాండ్‌లోనూ ఇండియా కూటమి గెలిచి ఉంటే ఎలాంటి ప్రశ్నలు ఉండవి కావన్నారు. అబద్ధాల వల్ల కూటములు నిలబడవని, ఇప్పటికైనా అభిషేక్ బెనర్జీ ఈ నిజాన్ని గ్రహించినట్టు కనిపిస్తోందని డూబై వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...