Sunita Kejriwal: సునీతా ది బెస్ట్... ఆప్ మంత్రి సౌరబ్ భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 05 , 2024 | 05:50 PM
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన సాగిస్తున్న క్రమంలో పార్టీని ఏకతాటిపై నడిపించ గలిగే సత్తా సునీతా కేజ్రీవాల్ కు ఉందని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ(Delhi Liquor policy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచే పాలన సాగిస్తున్న క్రమంలో పార్టీని ఏకతాటిపై నడిపించే వ్యక్తి ఎవరనే ఆసక్తికర చర్చ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో జరుగుతోంది. దీనిపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీని ఏకతాటిపై ఉంచేందుకు కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) తగిన వ్యక్తి అని సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు.
కేజ్రీవాల్ మెసెంజర్‌గా సునీతా అగర్వాల్ చెబుతుంటారని, కేజ్రీవాల్ పంపే సందేశాలను ఆమె వినిపిస్తున్నారని, పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరులపై ఇది సానుకూలం ప్రభావం చూపిస్తోందని సౌరభ్ చెప్పారు. పార్టీని ఐక్యంగా ఉంచేందుకు ఆమె తగిన వ్యక్తిగా తాను భావిస్తున్నట్టు తెలిపారు. పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సునీత ప్రచారం చేసే అవకాశాలపై అడిగనప్పుడు, ఇదే జరిగితే తాము సంతోషిస్తామని, అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం ఆమేనని సమాధానమిచ్చారు. మద్యం కేసులో అరెస్టయి బెయిలుపై బయటకు వచ్చిన ఆప్ నేత సంజయ్ సింగ్ బుధవారంనాడు కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి సునీతా కేజ్రీవాల్‌ను కలుసుకోవడంపై అడిగిన ప్రశ్నకు సౌరభ్ సమాధానమిస్తూ, పెద్దన్న కష్టాల్లో ఉంటే ఆయన కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎవరికైనా విద్యుక్త ధర్మమని అన్నారు. కేజ్రీవాల్ కుటుంబాన్ని సంజయ్ సింగ్ తన కుటుంబంగా భావిస్తారని, కేజ్రీవాల్‌ను పెద్దన్నగా భావిస్తారని చెప్పారు. ఆ కారణంగానే సునీత పాదాలకు ఆయన నమస్కరించారని, తాముంతా ఒకే కుటుంబంగా, కలిసికట్టుగా ఉన్నామని సౌరభ్ భరద్వాజ్ వివరించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.