Supreme Court: ప్రార్థన స్థలాలపై విచారణ ఆపండి!
ABN , Publish Date - Dec 13 , 2024 | 05:20 AM
తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ దేశంలోని ఏ కోర్టూ.. ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను తీసుకోరాదని, ఇప్పటికే ఉన్న కేసుల్లో సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు, తుది ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది.
మేం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా కొత్త వ్యాజ్యాలు స్వీకరించొద్దు
పెండింగ్ కేసుల్లో తీర్పులు ఇవ్వొద్దు
సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలూ వద్దు
కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం కౌంటర్‌కు కేంద్రానికి నెల గడువు
న్యూఢిల్లీ, డిసెంబరు 12: తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ దేశంలోని ఏ కోర్టూ.. ప్రార్థనా స్థలాలకు సంబంధించి కొత్త వ్యాజ్యాలను తీసుకోరాదని, ఇప్పటికే ఉన్న కేసుల్లో సర్వే నిర్వహణ సహా ఎలాంటి మధ్యంతర ఆదేశాలు, తుది ఉత్తర్వులు జారీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘‘ఈ అంశం మా (సర్వోన్నత న్యాయస్థానం) పరిధిలో ఉన్నందున, మేం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకూ దీనిపై కొత్త కేసులు స్వీకరించడం, పాత కేసుల్లో చర్యలు తీసుకోవడం సముచితం కాదని భావిస్తున్నాం’’ అని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991’’లోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్ సహా ఆరు పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
కాశీలో జ్ఞానవాపి, మథురలో షాహీ ఈద్గాహ్ మసీదు సహా దేశవ్యాప్తంగా 10 మసీదులు/ముస్లిం ప్రార్థనా మందిరాల్లో సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన 18 వ్యాజ్యాల్లో తదుపరి విచారణలు ఈ ఆదేశాలతో నిలిచిపోనున్నాయి. 1947 ఆగస్టు 15 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రార్థనా స్థలాల మత స్వభావాన్ని మార్చడానికి వీల్లేకుండా 1991లో అప్పటి కాంగ్రెస్ సర్కారు.. ‘‘ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం, 1991’’ని రూపొందించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు మాత్రం ఈ చట్టం పరిధిలోకి రాకుండా.. ఇదే చట్టంలోని సెక్షన్ ఐదు ద్వారా మినహాయింపునిచ్చారు. ఈ చట్టంలోని నిబంధనలను వ్యతరేకిస్తూ.. ఈ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. అదే సమయంలో.. ఈ చట్టాన్ని రద్దు చేస్తే దేశంలో మతసామరస్యం దెబ్బతింటుందని, కాబట్టి దాన్ని రద్దు చేయకూడదని, హిందూ పక్షాలు కేసులు వేసిన మసీదుల యథాతథస్థితిని కొనసాగించాలని కోరుతూ కూడా పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లన్నింటినీ విచారిస్తున్న ధర్మాసనం.. తాము ఈ చట్టం న్యాయబద్ధతను, పరిధిని పరిశీలిస్తున్నామని, కాబట్టి దేశంలోని ఇతర కోర్టులు ఈ తరహా కేసుల్లో విచారణ చేపట్టవద్దని చెప్పడం అనివార్యంగా భావిస్తున్నామని పేర్కొంది. అయితే, ఒక హిందూ పక్షం తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది జె.సాయి దీపక్.. సుప్రీం ఆదేశాలను వ్యతిరేకించారు. ఇలాంటి ఆదేశాలు ఇచ్చేముందు అన్ని పక్షాల వాదనలూ వినాలని కోరారు. దీనికి సీజేఐ.. సుప్రీంకోర్టు విస్తృత పరిశీలనలో ఉన్న అంశాలపై ఎలాంటి ఆదేశాలూ జారీచేయొద్దని కోర్టులను కోరడం సహజమేనని గుర్తుచేశారు. ట్రయల్ కోర్టులు సుప్రీంకోర్టును కాదని విచారణ జరపవచ్చా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై కేంద్రం వైఖరి ఏమిటో తెలియకుండా నిర్ణయం తీసుకోలేం కాబట్టి.. నాలుగు వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని, దాన్ని ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకునే విధంగా వెబ్‌సైట్‌లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్రం స్పందనపై సమాధానాల దాఖలుకు ఈ కేసుల్లో పార్టీలుగా ఉన్నవారికి మరో నాలుగువారాల గడువిచ్చారు. అలాగే.. ఈ కేసులో కేంద్రం తరఫున కాను అగర్వాల్‌ను, చట్టాన్ని సవాల్ చేస్తున్న పిటిషనర్ల తరఫున విష్ణు శంకర్ జైన్‌ను, చట్టాన్ని సమర్థిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పక్షాల తరఫున ఇజాజ్ మక్బూల్‌ను నోడల్ న్యాయవాదులుగా నియమించిన సుప్రీంకోర్టు, తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.