Supreme Court: బుల్డోజర్ చర్యకు అధికారులదే బాధ్యత, నష్టపరిహారం చెల్లించాలి: సుప్రీం కీలక మార్గదర్శకాలు
ABN , Publish Date - Nov 13 , 2024 | 01:35 PM
వ్యక్తుల ఆస్తులకు నష్టం కలిగిస్తే అది న్యాయవ్యవస్థను ధిక్కరించడం కిందకే వస్తుంది. అధికారులు జడ్జులగా మారి నిందితుల ఆస్తులను కూల్చివేసే నిర్ణయాన్ని తీసుకోకూడదు అని కోర్డు రాష్ట్రాలకు మొట్టికాయలు వేసింది.
ఢిల్లీ: బుల్డోజర్ యాక్షన్ పేరుతో వ్యక్తుల ఇళ్లు, ఆస్తుల కూల్చివేతపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు జడ్జిల్లా మారి నిందితుల ఆస్తులను కూల్చే నిర్ణయం తీసుకోవడం సరికాదంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. కేవలం ఓ కేసులో నిందితులు, దోషులుగా ఉన్నంతమాత్రాన వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. ఆస్తుల కూల్చివేతపై మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై బుధవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ మేరకు కీలక మార్గదర్శకాలను వెలువరించింది.
సొంతింటి కలను కాలరాయకండి..
ప్రతి కుటుంబం సొంతింటిని కలిగి ఉండాలని ఎన్నో కలలు కంటుంది. నేరానికి శిక్ష కింద వారి ఆస్తులను లాక్కుని ధ్వంసం చేసే హక్కు అధికారులకు ఉంటుందా అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. చట్టబద్దమైన పాలన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి పునాది. నిందితల నేరం రుజువు కాక ముందే వారిని శిక్షించే విధానాన్ని న్యాయవ్యవస్థ హర్షించదు అని జస్టిస్ గవాయ్ తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.
వారిని కోర్టు విడిచిపెట్టదు..
ప్రజల ఆస్తులను ఏ కారణం చేత గానీ ధ్వంసం చేయరాదు. రాష్ట్రల ఏకపక్ష చర్యల నుంచి వ్యక్తులకు రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగం వారికి కొన్ని హక్కులను ఇచ్చింది. ఆస్తులను తీసి వేసేముందు వ్యక్తులకు సమాచారం ఇవ్వాల్సిన చట్ట నియమం ఒకటి ఉంది అని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలుకానీ దాని ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలు కానీ మితిమీరిన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. నిరంకుశత్వంతో నిందితులు, దోషుల హక్కులను రాష్ట్రాలు ఉల్లంఘించరాదు. ఏ అధికారి అయినా ఇటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడితే వారికి జరిమానా విధించాల్సి ఉంటుంది. హక్కుల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం విడిచిపెట్టదు అని కోర్టు తెలిపింది.
కేవలం ఆరోపణల ఆధారంగా వ్యక్తులను దోషులుగా ప్రకటించలేం. వారు ఆస్తులకు నష్టం కలిగిస్తే అది న్యాయవ్యవస్థను ధిక్కరించడం కిందకే వస్తుంది. అధికారులు జడ్జులగా మారి నిందితుల ఆస్తులను కూల్చివేసే నిర్ణయాన్ని తీసుకోకూడదు అని కోర్డు రాష్ట్రాలకు మొట్టికాయలు వేసింది. ప్రతి వ్యక్తికి ఇంటి ద్వారా ఆశ్రయం పొందే హక్కు ఉంది. దానిని తొలగిస్తే ఆర్టికల్ 19 ప్రకారం ప్రాథమిక హక్కును ఉల్లంఘించిన నేరం కిందకు వస్తుంది అని కోర్టు చెప్పింది.
తీర్పు సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ రాత్రిపూట మహిళలను, పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదించదగినది కాదన్నారు. ముందస్తు షోకాజ్ నోటీసు లేకుండా, నోటీసులు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోపు కూల్చివేతలు చేపట్టే అధికారం ఎవరికీ లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
కూల్చివేత ప్రక్రియలను వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూమిలో అనధికారికంగా నిర్మాణాలు జరిగినా లేదా న్యాయస్థానం ద్వారా కూల్చివేతకు ఆదేశించినా తమ ఆదేశాలు వారికి వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం, క్రిమినల్ చట్టాల ప్రకారం నిందితులు, దోషులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయని వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీం కోర్టు కీలక మార్గదర్శకాలు..
కూల్చివేత ఉత్తర్వులు ఆమోదించబడిన తర్వాత కూడా అవసరమైతే వాటిని సవాలు చేయడానికి బాధిత పక్షానికి సమయం ఇవ్వాలి.
రాత్రిపూట ఇళ్లు ఖాళీ చేయించి మహిళలు, పిలలను రోడ్లపై నిలబెట్టడం సరైన చర్యకాదని సుప్రీం పేర్కొంది.
షోకాజ్ నోటీసు లేకుండా కూల్చివేత చేయకూడదు. దానికి మున్సిపల్ చట్టాలలో ఇచ్చిన సమయం ప్రకారం లేదా నోటీసు తేదీ నుంచి 15 రోజులలోపు ఏది ఆలస్యం అయితే దానికి సమాధానం ఇవ్వాలి.
మునుపటి తేదీ నుంచి ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూల్చివేతలను నిలిపివేయాలని కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసు పంపబడుతుంది. నేటి నుంచి నెల రోజుల్లోగా నిర్మాణాల కూల్చివేతలకు నోడల్ అధికారిని డీఎం నియమించనున్నారు.
నోటీసు ఉల్లంఘన రకం, వ్యక్తిగత విచారణ తేదీ, విచారణ రావాల్సిన వారి వివరాలు అందులో తెలియజేస్తారు. నిర్దిష్ట డిజిటల్ పోర్టల్లో దానిని అందుబాటులో ఉంచుతాం.
అథారిటీ వ్యక్తిగా విచారణను నిర్వహిస్తుంది. అన్ని నిమిషాలు రికార్డ్ చేయబడుతుంది. ఆ తర్వాత తుది ఉత్తర్వు జారీ చేయబడుతుంది. ఇది చట్టవిరుద్ధమైన నిర్మాణం చర్చించదగినదేనా అని సమాధానం ఇవ్వాలి. కూల్చవేత ఉద్దేశ్యం ఏమిటో చెప్పాలి. కూల్చివేతలను వీడియో తీసి నివేదికను డిజిటల్ పోర్టల్ లో ఉంచాలి.
కూల్చివేత నిబంధనలను ఉల్లంఘించిన అధికారులు బాధితుల ఆస్తులపై బాధ్యత వహించాల్సి ఉంటుంది. నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారి వ్యక్తిగత ఖర్చులకు కూడా బాధ్యత అధికారులదే అవుతుంది.
నోటీసు బ్యాక్-డేటింగ్ ఆరోపణలను నిరోధించడానికి యజమాని/ఆక్రమణదారుకు షోకాజ్ నోటీసు అందిన వెంటనే, కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయానికి సమాచారం పంపబడుతుంది. స్వయంచాలక రసీదు వారి కార్యాలయం ద్వారా ఉండాలి.
ప్రతి మునిసిపల్ స్థానిక అధికారం ఈరోజు నుండి 3 నెలలలోపు నిర్దేశించబడిన డిజిటల్ పోర్టల్‌ను కేటాయించాలి, అందులో సేవకు సంబంధించిన వివరాలు, నోటీసును అతికించడం, ప్రత్యుత్తరం ఆమోదించబడిన ఆర్డర్ అందుబాటులో ఉండాలి.
Bulldozer Justice: బుల్డోజర్ న్యాయంపై సుప్రీం కోర్టు సీరియస్.. ఏమన్నదంటే..