Supreme Court: సంభాల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే!
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:36 AM
యూపీలోని చందాసీలో ఉన్న మొఘల్ కాలం నాటి జామా మసీదు సర్వే అంశం మీద స్థానిక సంభాల్ జిల్లా కోర్టు జరుపుతున్న విచారణపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిలుపుదల (స్టే) విధించింది.
న్యూఢిల్లీ, నవంబరు 29: యూపీలోని చందాసీలో ఉన్న మొఘల్ కాలం నాటి జామా మసీదు సర్వే అంశం మీద స్థానిక సంభాల్ జిల్లా కోర్టు జరుపుతున్న విచారణపై సుప్రీంకోర్టు తాత్కాలిక నిలుపుదల (స్టే) విధించింది. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు మసీదులో సర్వే జరిపిన కోర్టు కమిషనర్ రూపొందించే నివేదికను తదుపరి ఆదేశాల వరకూ బహిరంగపరచవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
మసీదులో సర్వే జరపాలంటూ సంభాల్ జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ షాహీ జామా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. స్థానిక కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు రాకుండా, తొలుత హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని పిటిషనర్లకు సూచించింది. మూడు పనిదినాల్లో అలహాబాద్ హైకోర్టు ఈ అంశాన్ని విచారణకు తీసుకోవాలని ఆదేశించింది.