ఎఫ్‌ఐఆర్ లేకున్నా ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చా?
ABN , Publish Date - Dec 03 , 2024 | 03:58 AM
నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాకమునుపే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోవచ్చా అన్న కీలక ప్రశ్నపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 2: నేరాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాకమునుపే మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద నిందితుల ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకోవచ్చా అన్న కీలక ప్రశ్నపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ అంశం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌ల ధర్మాసనం ముందుకు వచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రయివేటు కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకూడదంటూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.
విచారణలో భాగంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎల్‌ఎంఏ)లోని సెక్షన్-5లో ఉన్న రెండు నిబంధనలపై సామరస్యపూర్వక భాష్యం చెప్పనుంది. మొదటి నిబంధన ప్రకారం...ఆస్తులు నమోదు చేయాలంటే ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి. రెండో నిబంధన ప్రకారం...మనీలాండరింగ్ కింద విచారణ ప్రారంభించాలనుకుంటే మాత్రం ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసుకోకుండానే ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ఈడీకి ఉంది. దాంతో మొదటి నిబంధనను పాటించకుండానే స్వతంత్రంగా రెండో నిబంధనను అమలు చేయవచ్చా? అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 17కు వాయిదా పడింది.