Supreme Court : ఆ పత్రం ఎక్కడ?
ABN , Publish Date - Sep 10 , 2024 | 04:04 AM
కోల్‌కతా ప్రభుత్వ వైద్య కళాశాలలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి కేసులో మృతురాలి శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం కనిపించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మృతదేహాన్ని శవపరీక్షకు ఇచ్చినప్పుడు వైద్యులిచ్చే డాక్యుమెంట్ ఏది?
కోల్‌కతా హత్యాచారం కేసులో సీబీఐ, బెంగాల్ సర్కారుకు సుప్రీం ప్రశ్న
మృతురాలి ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: కోల్‌కతా ప్రభుత్వ వైద్య కళాశాలలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి కేసులో మృతురాలి శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం కనిపించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. మరోవైపు హత్యాచార ఘటనను నిరసిసస్తూ ఆందోళనలకు దిగిన వైద్యులు విధుల్లో చేరాలని సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు హాజరవకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసును విచారించింది.
ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అప్పగించిన సమయంలో ఇవ్వాల్సిన పత్రం ఎక్కడ ఉందని సీజేఐ ధర్మాసనం సీబీఐని, బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఆ పత్రం తమ రికార్డుల్లో లేదని సీబీఐ తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ.. ఆ పత్రం గురించి తనకూ తెలియదని, తర్వాత దానికి సమాధానం ఇస్తానని చెప్పారు. అత్యాచారం, హత్య జరిగిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కోల్‌కతా పోలీసులకు 14 గంటలు ఎందుకు పట్టిందని ధర్మాసనం మరోసారి ప్రశ్నించింది. అలాగే ఈ కేసు దర్యాప్తుపై ఈ నెల 17న తాజా నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
ఇక మృతురాలి ఫొటోలను అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేసు దర్యాప్తుపై సీబీఐ స్థాయీ నివేదికను సమర్పించిందని, కేసు విచారణ కొనసాగుతోందని.. ఈ విషయంలో సీబీఐకి తాము సలహాలు ఇవ్వాలనుకోవడం లేదని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఆర్జీ కర్ కళాశాలలో హత్యాచార ఘటన జరిగిన ప్రదేశంలో సేకరించిన ఫోరెన్సిక్ నమూనాలను రాష్ట్ర ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగం పరిశీలించిందని, వాటిని తాము ఢిల్లీ ఎయిమ్స్‌కు పంపాలని నిర్ణయించామని తుషార్ మెహతా ధర్మాసనానికి తెలిపారు. ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో భద్రత కోసం నియమించిన మూడు కంపెనీల సీఐఎ్‌సఎఫ్ సిబ్బందికి తక్షణమే సౌకర్యాలు కల్పించాలని బెంగాల్ హోంశాఖను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. కాగా, వైద్యుల నిరసన కారణంగా రాష్ట్రంలో 23 మంది మరణించారని బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.