Sushil Modi: సుశీల్ మోదీ కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం
ABN , Publish Date - May 14 , 2024 | 03:46 AM
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు.
క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటూ
తుదిశ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత
తీవ్ర సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
బిహార్ డిప్యూటీ సీఎంగా
11 ఏళ్లు పని చేసిన సుశీల్ మోదీ
ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలలో కీలకం
బీజేపీ సీనియర్ నేత
పట్నా, మే 13: బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. సుశీల్ కుమార్ మోదీ ఏడు నెలలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే గత నెలలో ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఆరోగ్యం సహకరించనందున ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టు తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సుశీల్‌మోదీ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఆయన ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. 1973లో విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సుశీల్ మోదీ.. 1990లో పట్నా సెంట్రల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, ఎంపీగా సేవలందించారు. 2005 నుంచి 2020 మధ్య రెండు దఫాలుగా 11 ఏళ్ల పాటు బిహార్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుశీల్ మోదీ కన్నుమూతపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఆయన ఉన్నత ఆదర్శాలను పాటించారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘నా స్నేహితుడు, సహచరుడు సుశీల్‌మోదీ ఆకస్మిక మరణం తీవ్ర విచారం కలగజేసింది. బిహార్‌లో బీజేపీ విజయయాత్రలో ఆయనది అత్యంత కీలకపాత్ర. జీఎస్టీ అమలుకు సంబంధించి ఆయన సేవలు మర్చిపోలేం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పలు పార్టీల నేతలు సుశీల్‌మోదీ మృతికి సంతాపం తెలిపారు. మంగళవారం సుశీల్ మోదీ అంత్యక్రియలు జరగనున్నాయి.