Bridge collaps: గంగోత్రికి దగ్గర్లో కుప్పకూలిన తాత్కాలిక వంతెన, నిలిచిపోయిన యాత్రికులు
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:10 PM
ఉత్తరాఖండ్ ను ఎడతెరిపి లేని వానలు, పొంగిపొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి. గోముఖ్ ఫుట్‌పాత్‌పై గంగోత్రికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో 30 నుంచి 40 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇద్దరు యాత్రికులు దేవ్‌గఢ్‌లోని నదీ ప్రవాహం ఉధృతికి కొట్టుకుపోయారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ (Uttarakhand)ను ఎడతెరిపి లేని వానలు, పొంగిపొర్లుతున్న నదులు వణికిస్తున్నాయి. గోముఖ్ ఫుట్‌పాత్‌పై గంగోత్రికి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో 30 నుంచి 40 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఇద్దరు యాత్రికులు దేవ్‌గఢ్‌లోని నదీ ప్రవాహం ఉధృతికి కొట్టుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని యాత్రికులు సురక్షితంగా నది దాటించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతవరకూ 16 మంది యాత్రికులను కాపాడామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఎస్‌డీఆర్ఎఫ్ అధికారులు తెలిపారు.
వర్షాలతో వణుకుతున్న ఉత్తరాఖండ్
దీనికి ముందు, గత మంగళవారంనాడు డెహ్రాడూన్‌లోని రాబర్స్ కేవ్ సమీపంలోని ఐలాండ్‌లో చిక్కుకుపోయిన 10 మంది యువకులను ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు. హరిద్వార్‌లో గత వారంలో భారీ వర్షాలు కురియడంతో గంగానదిలో ప్రవాహం పెరిగింది. వరద నీటి ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోగా, రోడ్డు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో స్థానికులు, పర్యాటకులు ఎవరూ కూడా నదీస్నానానికి వెళ్లవద్దని స్థానిక యంత్రాంగం హెచ్చరించింది.