Share News

GST Scam: జీఎస్టీ స్కాంలో జర్నలిస్టుకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

ABN , Publish Date - Oct 31 , 2024 | 08:22 AM

వస్తు సేవల పన్ను(GST) మోసానికి సంబంధించిన కేసులో 'ది హిందూ' జర్నలిస్టు మహేశ్ లంగా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు బుధవారం కొట్టేసింది.

GST Scam: జీఎస్టీ స్కాంలో జర్నలిస్టుకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

అహ్మదాబాద్: వస్తు సేవల పన్ను(GST) మోసానికి సంబంధించిన కేసులో 'ది హిందూ' జర్నలిస్టు మహేశ్ లంగా బెయిల్ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు బుధవారం కొట్టేసింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మనీష్ వి చౌహాన్ అతని బెయిల్‌ని తిరస్కరించారు. ఆదాయపు, వస్తు సేవల పన్ను ఎగవేసేందుకు సదరు జర్నలిస్టు ఇతరులతో కలిసి కుట్ర పన్నాడని అభియోగాలున్నాయి. ధృవి ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీ ద్వారా మహేశ్ నేరుగా రూ.44 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపినట్లు విచారణలో తేలింది. బోగస్ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లను సులభతరం చేసేందుకే ఈ లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కోర్టు పేర్కొంది. "మహేశ్ సహ నిందితులతో కలిసి ధృవీ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థతో జీఎస్టీని ఎగవేసేందుకు కుట్ర పన్నారు.


కేసు పత్రాలను పరిశీలిస్తే నిందితుడు ఈ కేసులో క్రియాశీల పాత్ర పోషించినట్లు అర్థమవుతోంది. విచారణ ఇంకా కొనసాగుతున్నందునా.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అందుకే బెయిల్ రద్దు చేశాం" అని కోర్టు పేర్కొంది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను మోసపూరితంగా పొందేందుకు ధ్రువి ఎంటర్‌ప్రైజెస్ శాశ్వత ఖాతా నంబర్‌ను ఉపయోగించి ఆరు బోగస్ సంస్థలను సృష్టించిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో అక్టోబర్ 7న మహేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. మేజిస్ట్రేట్ రిమాండ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టులో అతను బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే అక్టోబర్ 14న పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు.


మరో రెండు కేసుల్లో..

పిటిషన్ ఉపసంహరించుకున్న తర్వాత మరో రెండు కేసుల్లో మహేశ్ నిందితుడిగా మారాడు. అహ్మదాబాద్‌లో ఒక వ్యాపారవేత్తను మోసం చేశారనే ఆరోపణలపై పోలీసులు మహేశ్‌పై కేసు నమోదు చేశారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. గుజరాత్ మారిటైమ్ బోర్డుకు సంబంధించిన ప్రభుత్వ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలతో అక్టోబర్ 22న రెండో కేసు నమోదు చేశారు.


మొదటి కేసులో అరెస్టయిన సమయంలో అతని నుంచి మారిటైమ్ బోర్డు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పత్రాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అతనిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని పలు సంస్థలు పోలీసులను కోరాయి. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్, ప్రెస్ అసోసియేషన్, ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్‌ల సంయుక్త ప్రకటనలో జర్నలిస్టులు తమ పనివేళలో అవసరం నిమిత్తం పలు రకాల పత్రాలను కలిగి ఉండవచ్చని పేర్కొంది.

Devotional: మెట్టినింటికి వెళ్లిన సోదరి కోసం ఓ పండుగ..

Updated Date - Oct 31 , 2024 | 08:22 AM