Marriage: ఓరి మీ దుంపతెగ.. పెళ్లి కోసం ఇవేం పనులురా అయ్యా..!
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:20 PM
Uttar Pradesh: ప్రతి జంట తమ పెళ్లి కోసం ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటారు. మరి ప్లాన్స్ వేయగానే సరిపోదు కదా.. ఆ వేడకకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఉంటే ఓకే.. లేదంటే ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అయితే, తాజాగా ఓ జంట తమ పెళ్లి కోసం చేయకూడని పని చేసింది.
లక్నో, జనవరి 25: పెళ్లి అనేది ప్రతి యువతి, యువకుడి జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం. మళ్లీ మళ్లీ జరుపుకోలేని ఈ ఘట్టాన్ని జీవితాంతం గుర్తుండేలా.. అంగరంగ వైభవంగా జరుపుకోవాలని భావిస్తుంటారు. ఈ మేరకు ప్రతి జంట తమ పెళ్లి కోసం ముందు నుంచే ప్లాన్స్ వేసుకుంటారు. మరి ప్లాన్స్ వేయగానే సరిపోదు కదా.. ఆ వేడుకకు భారీగా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఉంటే ఓకే.. లేదంటే ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అయితే, తాజాగా ఓ జంట తమ పెళ్లి కోసం చేయకూడని పని చేసింది. చివరకు జైలుపాలై ఊచలు లెక్కించాల్సి వస్తుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సినిమా రేంజ్‌లో మాస్టర్ ప్లాన్స్ వేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు, ఓ యువతిని అరెస్ట్ చేశారు లక్నో పోలీసులు. పెళ్లి కోసం డబ్బు సమకూర్చుకునేందుకు లక్నోలో ఒక యువ జంట బ్యాగులు, ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లేవారు. కానీ, అదృష్టం అన్నివేళలా ఒకేలా ఉండదు కదా. ఇక్కడా అదే జరిగింది. అనేక సందర్భాల్లో తప్పించుకోగలిగిన ఈ జంట.. ఇప్పుడు అడ్డంగా బుక్కయారు. వీరిద్దరితో పాటు.. వీరికి సహాయం చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
ప్రియురాలితో పెళ్లి కోసం..
ఘాజీపూర్ ప్రాంతానికి చెందిన శివమ్ రాయ్, హిమన్షు యాదవ్, ఖుషీ(అందరూ 19 ఏళ్ల వయస్సున్న వారే) లక్నో వచ్చి దోపిడీలకు పాల్పడుతున్నారు. శివమ్, హిమాన్షు 10వ తరగతి తరువాత చదువు మానేశారు. వీరిద్దరూ ఉపాధి లేక ఖాళీగా ఉండేవారు. ఈ క్రమంలోనే ఘాజీపూర్‌కు చెందిన ఖుషీతో శివమ్ ప్రేమలో పడ్డాడు. మధ్యతరగతి నేపథ్యానికి చెందిన శివమ్.. తాను ఖుషీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. దాంతో ఆగ్రహించిన అతని తండ్రి.. ముందు మంచి ఉద్యోగం చెయ్యమని, ఆ తరువాత పెళ్లి చేసుకోవచ్చని హెచ్చరించాడు. దాంతో శివమ్, ఖుషీ తమ పెళ్లి కోసం డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. చోరీలే సరైన పని నిర్ణయించుకున్నారు. వీరికి హిమాన్షు కూడో తోడయ్యాడు. ఇంకేముంది.. వీరు ముగ్గురూ కలిసి తొలుత ఘాజీపూర్‌లో చోరీ చేసేవారు. ఇక్కడ ఫలితం లేదని, లక్నోకు షిఫ్ట్ అవ్వాలని ముగ్గురూ డిసైడ్ అయ్యారు. అనుకున్నట్లుగానే.. ఈ ముగ్గురూ లక్నోకు వెళ్లారు. పెళ్లి కోసం డబ్బు త్వరగా సంపాదించేందుకు వరుస దోపిడీలకు పాల్పడ్డారు.
ఖతర్నాక్ ప్లాన్..
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. శివమ్, ఖుషీ చోరీకి పాల్పడితే.. హిమాన్షు మాత్రం పోలీస్ వేషంలో వారి వెనుకే ఫాలో అవుతూ ప్రొటెక్ట్ చేసేవాడు. అంటే వారు చోరీ చేస్తుండగా ఎవరైనా పట్టుకుంటే.. వెంటనే పోలీస్ మాదిరిగా ఘటనా స్థలికి వచ్చి వారిద్దరినీ పట్టుకునేవాడు. ఆ తరువాత ముగ్గురూ కలిసి జంప్ అయ్యేవారు. ఇలా బ్యాగులు, ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లేవారు. వరుస చోరీలపై కంప్లైంట్స్ రావడంతో అలర్ట్ అయిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన వస్తువులను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.