Kolkata: బీజేపీకి కౌంటర్.. ఆ తేదీన టీఎంసీ భారీ ర్యాలీ
ABN , Publish Date - Feb 25 , 2024 | 09:19 PM
సార్వత్రిక సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ.. టీఎంసీ(TMC) భారీ ర్యాలీ చేపట్టడానికి నిర్ణయించింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది.
కోల్‌కతా: సార్వత్రిక సమరానికి సమయం దగ్గరపడుతున్న వేళ.. టీఎంసీ(TMC) భారీ ర్యాలీ చేపట్టడానికి నిర్ణయించింది. మార్చి 10న కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది. దక్షిణ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ నేతపై భూకబ్జాలు, లైంగిక ఆరోపణలు రావడంతో రాజకీయ దుమారం చెలరేగిన విషయం విదితమే.
ఈ క్రమంలో టీఎంసీ జనగర్జన సభను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. మార్చి 1, 2, 6 తేదీల్లో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. బీజేపీకి పోటీగా టీఎంసీ ర్యాలీ నిర్వహిస్తోందని రాజకీయ నిపుణులు అంటున్నారు. టీఎంసీ నేతపై ఆరోపణలు రావడంతో ఆ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రధాని మోదీ మార్చి 1న హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్, మార్చి 2న నదియా జిల్లాలోని కృష్ణానగర్, మార్చి 6న ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాసత్‌లో ర్యాలీలో పాల్గొంటారు. ఉత్తర 24 పరగణాల జిల్లా సమీపంలోనే సందేశ్‌ఖాలీ ఉంది. తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. మార్చి 10న దీదీ ప్రసంగిస్తారని ఇది కేవలం టీజర్ మాత్రమే అని.. బీజేపీకి అసలు సినిమా ముందుందని అన్నారు. "రాష్ట్రాలకు పంపే నిధులను కేంద్రం నిలిపేసింది. ప్రజల సమస్యలను వినడానికి మోదీ సిద్ధంగా లేరు. వీటికి వ్యతిరేకంగా ర్యాలీ చేపడుతున్నాం" అని అభిషేక్ అన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి