Share News

UP: పొగమంచుతో కానరాని దారి.. ఒక్కదాన్నొకటి ఢీకొన్న వాహనాలు

ABN , Publish Date - Nov 19 , 2024 | 03:29 PM

పశ్చిమ ఉత్తప్రదేశ్‌లో వాతావరణ కాలుష్యం మంగళవారం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలకు దారి తీసింది. దారి కానరాక కార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బైకర్లు అసువులు బాసారు. దీంతో, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు.

UP: పొగమంచుతో కానరాని దారి.. ఒక్కదాన్నొకటి ఢీకొన్న వాహనాలు

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమ ఉత్తప్రదేశ్‌లో వాతావరణ కాలుష్యం పలుచోట్ల రోడ్డు ప్రమాదాలకు దారి తీసింది. మంగళవారం దారి కానరాక కార్లు, ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అక్కడి ఎక్స్‌ప్రెస్ వేలపై జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బైకర్లు అసువులు బాసారు. దీంతో, అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు (Uttarpradesh).

Snow: మంచుదుప్పటిలో ఏర్కాడు.. చలికి వణకుతున్న పర్యాటకులు


జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్ వేపై పరుచుకున్న దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. రోడ్డుపై నిలిచిపోయిన ఓ ట్రక్‌ పొగమంచు కారణంగా కానరాక పలు వాహనాలు ఢీకొన్నాయి. వాహనాల్లోని బాధితులను సమీపంలోని సైఫాయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ‘‘మాకేమీ కనిపించక పోవడంతో మా వాహనం మరో వెహికిల్‌ను ఢీకొట్టింది. ఆ తరువాత వెనకగా వస్తున్న మరో మూడు నాలుగు కార్లు మమ్మల్ని ఢీకొట్టాయి’’ అని బాధితుడు ఒకరు తెలిపారు. ఈ ఘటన కారణంగా కాసేపు రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

ఈస్ట్రెన్ ఎక్స్‌ప్రెస్ వేపై కూడా పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు కానరాక ఓ ట్రక్ మరో ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో పానిపట్ నుంచి వస్తున్న మరో వాహనం ఈ ట్రక్కులను ఢీకొట్టడంతో బస్సులోని దాదాపు డజను ప్యాసెంజర్లకు గాయాలయ్యాయి.

Rains: 15 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం

ఇక బులంద్‌షహర్‌కు సమీపంలో జాతీయ రహదారిపై వెళుతున్న ఓ ట్రక్కు డ్రైవర్‌కు దారి కనబడక ముందు బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని ఢీకొట్టడంతో అతడు కన్నుమూశాడు. బదోన్ జిల్లాలీలో కూడా పొగమంచు కారణంగా ఓ గుర్తు తెలియని వాహనం ముందున్న బైకర్‌ను బలంగా ఢీకొట్టడంతో కన్నుమూశాడు.


ఇప్పటికే వాయుకాలుష్యంతో ఉక్కిరిబక్కిరి అవుతున్న ఉత్తరాదిన పొగమంచు కారణంగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో (న్యూఢిల్లీ) దట్టమైన పొగ మంచు కారణంగా హెల్త్ ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులు నెలకొన్నాయి. గొంతు నొప్పి, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తదితర సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో, విషపూరిత గాలి బారిన పడుకుండా ఉండేందుకు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు అభ్యర్థిస్తున్నారు. ఈ కాలుష్యం ప్రజారోగ్య సమస్యగా మారడంతో పాటు రోడ్లపై వాహనదారుల భద్రతను కూడా ప్రశ్నార్థం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు, ఇతర పాలనాయంత్రాంగం తగు చర్యలు చేపడుతోంది.

Read Latest and National News

Updated Date - Nov 19 , 2024 | 03:37 PM