Share News

లైఫ్‌ సపోర్ట్‌ తీసేయొచ్చు.. కేంద్రం కీలక నిర్ణయం

ABN , Publish Date - Sep 29 , 2024 | 03:35 AM

చికిత్సతో ఎంతమాత్రమూ కోలుకోవటానికి అవకాశం లేకుండా, మరణశయ్యపై ఉన్న రోగులకు పరోక్ష కారుణ్య మరణాన్ని అందించే అంశానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ముసాయిదా మార్గదర్శకాలను వెలువరించింది.

లైఫ్‌ సపోర్ట్‌ తీసేయొచ్చు.. కేంద్రం కీలక నిర్ణయం
Life support c

  • పరోక్ష కారుణ్య మరణానికి కేంద్రం ముసాయిదా మార్గదర్శకాల విడుదల

  • జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న రోగుల కోసం..

  • జీవనాధార వైద్య ప్రక్రియల తొలగింపు ద్వారా మరణం.. 4 షరతులు

  • వాటి ఆధారంగానే నిర్ణయం

  • అక్టోబరు 20 వరకు సూచనలకు అవకాశం

  • పరోక్ష కారుణ్య మరణానికి మార్గదర్శకాలు.. ముసాయిదా విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: చికిత్సతో ఎంతమాత్రమూ కోలుకోవటానికి అవకాశం లేకుండా, మరణశయ్యపై ఉన్న రోగులకు పరోక్ష కారుణ్య మరణాన్ని అందించే అంశానికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ముసాయిదా మార్గదర్శకాలను వెలువరించింది. జీవనాధార వైద్య ప్రక్రియలపైనే (లైఫ్‌ సస్టెయినింగ్‌ ట్రీట్‌మెంట్స్‌ - ఎల్‌ఎస్టీపై) ఆధారపడిన రోగులను దృష్టిలో ఉంచుకొని వీటిని రూపొందించారు. వీటి ప్రకారం.. వెంటిలేషన్‌, వాసోప్రెషర్స్‌, డయాలిసిస్‌, శస్త్రచికిత్సలు, ట్రాన్స్‌ఫ్యూజన్స్‌, పేరెంటల్‌ న్యూట్రిషన్స్‌ తదితర ప్రక్రియలను ఎల్‌ఎస్టీగా పేర్కొన్నారు. ‘వీటిని కొనసాగించటం ద్వారా రోగికి ఎంతమాత్రమూ ఉపశమనం లేనప్పుడు అవి రోగికి మరింత భారంగా పరిణమిస్తాయి. అంతేగాక రోగి కుటుంబంపై అవి మానసికంగా, ఆర్థికంగా ఒత్తిడి కలుగజేస్తాయి. ఇటువంటి ఐసీయూ కేసుల్లో ఎల్‌ఎస్టీని తొలగించటం ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానం’ అని వివరించారు.


నాలుగు షరతులు

ఎల్‌ఎస్టీని తొలగించటం ద్వారా రోగికి పరోక్ష కారుణ్య మరణాన్ని కల్పించటానికి పాటించాల్సిన నాలుగు షరతులను ఈ మార్గదర్శకాల్లో పొందుపరిచారు. అవి, 1. రోగిని బ్రెయిన్‌ డెడ్‌గా ప్రకటించారా? 2. రోగి పరిస్థితి పూర్తిగా విషమించిందని, ఎంత తీవ్రమైన చికిత్సను అందించినా మెరుగుపడే అవకాశం లేదని వైద్యులు భావిస్తున్నారా? 3. ఎల్‌ఎస్టీని కొనసాగించవద్దని రోగి లేదా రోగి తరఫు వ్యక్తులు రాతపూర్వకంగా తెలియజేశారా? 4. ఎల్‌ఎస్టీపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా?. వీటి ద్వారా ఎల్‌ఎస్టీ తొలగింపుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, ఆరోగ్యం పూర్తిగా విషమించిన రోగులకు ఎల్‌ఎస్టీ చికిత్సను ప్రారంభించే ముందు కూడా డాక్టర్లు ఈ షరతులను పరిగణనలోకి తీసుకోవాలని ముసాయిదా మార్గదర్శకాల్లో నిర్దేశించారు.


రోగి అంగీకారం..

చికిత్స జరిగే క్రమంలో తాను నిర్ణయాధికార సామర్థ్యాన్ని కోల్పోతే తన తరఫున వైద్యులు నిర్ణయం తీసుకోవటానికి వీలుగా రోగి అంగీకారం తెలియజేయవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. దీని ప్రకారం, ముగ్గురు వైద్యులతో ఒక ప్రైమరీ మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని, ఈ బోర్డు ఎల్‌ఎస్టీ తొలగింపుపై రోగికి సంబంధించిన వారికి అన్ని వివరాలు తెలిజేసి, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ నిర్ణయాన్ని, మరో ముగ్గురు వైద్యులతో కూడిన సెకండరీ మెడికల్‌ బోర్డు ఆమోదించాలని తెలిపారు. సెకండరీ బోర్డులో ఒక వైద్యుడిని జిల్లా వైద్యాధికారి నియమించాలన్నారు. కాగా, ఈ ముసాయిదా మార్గదర్శకాలపై వచ్చే నెల 20వ తేదీ వరకూ సూచనలు, సలహాలు తమకు తెలియజేయవచ్చని కేంద్రం తెలిపింది. పేషంట్‌ కోరిక మేరకు ప్రాణాలు తీయటాన్ని ప్రత్యక్ష కారుణ్య మరణం అని, ఎల్‌ఎస్టీ తొలగించడాన్ని పరోక్ష కారుణ్య మరణం అని పేర్కొంటారు.


  • డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది: ఐఎంఏ

కేంద్రం మార్గదర్శకాలను ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ వ్యతిరేకించారు. వీటి ద్వారా డాక్టర్లపై చట్టపరమైన చర్యలకు అవకాశం ఉంటుందని, వారి మీద ఒత్తిడి పెరుగుతుందని ఆయన తెలిపారు. యంత్రాల ద్వారా రోగిని బతికిస్తున్నారన్న ఆలోచనే తప్పు అని పేర్కొన్నారు. సైన్స్‌, పరిస్థితుల ఆధారంగా రోగి- కుటుంబసభ్యులు- డాక్టర్‌ కలిసి తీసుకునే నిర్ణయాలను వారికే వదిలేయాలని, మార్గదర్శకాల పేరుతో వాటిని పరిమితం చేయటం సరికాదన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Sep 29 , 2024 | 08:38 AM