బాంబు బెదిరింపులకు వేదికగా నిలవొద్దు
ABN , Publish Date - Oct 27 , 2024 | 03:55 AM
విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది.
విమానాలకు బెదిరింపుల నేపథ్యంలో
సోషల్ మీడియాకు కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ, అక్టోబరు 26: విమానాలకు బాంబు బెదిరింపులు తామరతంపరగా పెరిగిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియా కంపెనీలకు కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ శనివారం పలు సూచనలు జారీ చేసింది. నకిలీ బెదిరింపుల వంటి తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ వేదికలపై నుంచి తొలగించాలని పేర్కొంది. షేరింగ్, ఫార్వర్డ్, రీపోస్ట్, రీట్వీట్ వంటి ఆప్షన్ల వల్ల కూడా బెదిరింపులు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయని, కాబట్టి, ఈ తరహా సమాచారం ఇతరులకు అందుబాటులో లేకుండా చూ డాలని తెలిపింది. సదరు బెదిరింపులు భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి వ్యతిరేకమైనవని, సోషల్ మీడియా ద్వారా అటువంటి నేరాలకు పాల్పడే వ్యక్తుల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఐటీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, తమ వద్ద ఉన్న సమాచారాన్ని వీలైనంత తొందరగా (72గంటల్లోపు) దర్యాప్తు సంస్థలకు అందజేయాలని పేర్కొంది. ఖాతాదారుల పోస్టులకు బాధ్యత వహించాల్సిన అవసరం లేకుండా సోషల్ మీడియా సంస్థలకు ఐటీ చట్టం, 2021 రక్షణ కల్పిస్తున్న విషయాన్ని కేంద్రం ఈ సూచనల్లో ప్రస్తావించింది. అయితే, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా నిలుస్తున్నప్పుడు ఈ రక్షణ ఉండదని, అటువంటప్పుడు ఆయా సంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.