UPSC Vs Puja Khedkar: ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూపీఎస్‌సీ కేసు, నోటీసులు
ABN , Publish Date - Jul 19 , 2024 | 03:44 PM
వివాదాస్పద ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలకు దిగింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత కోసం మోసపూరితంగా సర్టిఫికెట్లు పొందిన అభియోగాలపై ఆమెపై శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఐఏఎస్ ట్రైనీ పూజా ఖేద్కర్ (Puja Khedkar)పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చర్యలకు దిగింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత కోసం మోసపూరితంగా సర్టిఫికెట్లు పొందిన అభియోగాలపై ఆమెపై శుక్రవారంనాడు కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2022కు సంబంధించి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేందుకు, భవిష్యత్ పరీక్షల నుంచి డిబార్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు షోకాజ్ నోటీసును కూడా పూజా ఖేద్కర్‌కు పంపింది.
Vinay Mohan Kwatra: అమెరికాకు భారత కొత్త రాయబారిగా క్వాత్రా
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2022లో ఉత్తీర్ణత కోసం పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ పలు అవకతవకలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని ఒక ప్రకటనలో యూపీఎస్‌సీ తెలిపింది. తన పేరు, తల్లి, తండ్రి పేరు, ఫోటో, సంతకం, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, చిరునామా మార్చడం, నకిలీ గుర్తింపు వంటివి మోసపూరితంగా పొందినట్టు తమ విచారణలో వెల్లడైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా ఆమెపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దిగడం, 2022 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడం, భవిష్యత్ పరీక్షల నుంచి డిబార్ చేయడం వంటి చర్యలతో పాటు పూజా ఖేద్కర్‌కు నోటీసులు వంటి చర్యలను ప్రారంభించినట్టు ఆ ప్రకటనలో తెలిపింది. రాజ్యాంగ నిబద్ధత, యూపీఎస్‌సీ పరీక్షల నిర్వహణలో విశ్వసనీయతకు తాము కట్టుబడి ఉన్నట్టు వివరించింది.