Share News

కాంట్రాక్టుకు లంచం

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:15 AM

భారత కుబేరుడు గౌతమ్‌ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చల్లారకముందే..

కాంట్రాక్టుకు లంచం

భారత సంస్థలకు అమెరికా కంపెనీల భారీ ముడుపులు

ఇచ్చింది మూగ్‌, ఒరాకిల్‌ కార్పొరేషన్‌, అల్బెమార్లె

తీసుకున్నది ద.మ.రైల్వే, హెచ్‌ఏఎల్‌, ఐవోసీ అధికారులు

డబ్బులిచ్చిన సంస్థలపై అమెరికా జరిమానాల కొరడా

ముడుపులపై 300 శాతం అధికంగా పెనాల్టీ

ప్రాసిక్యూషన్‌ను తప్పించడానికి యూఎస్‌ నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబరు 16: భారత కుబేరుడు గౌతమ్‌ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణల వేడి చల్లారకముందే.. ఇప్పుడు అలాంటి లంచాల కథే మరొకటి వెలుగుచూసింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు. పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు, ఇతర దేశాల్లోని సంస్థలు. అయితే కేసుల్లేకుండా చేయడానికి లంచాలు ఇచ్చిన తమ కంపెనీలపై అమెరికా ప్రభుత్వం భారీ పెనాల్టీ విధించింది. ఆ కంపెనీలు ఇచ్చిన ముడుపులపై 300 శాతం అధికంగా జరిమానా వేసి ప్రాసిక్యూషన్‌ను తప్పించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ కమిషన్‌ (సెక్‌) ఆదేశాలను బట్టి జరిమానాలు చెల్లించిన కంపెనీల్లో మూగ్‌ ఇంక్‌, ఒరాకిల్‌ కార్పొరేషన్‌, అల్బెమార్లె కార్పొరేషన్‌ ఉన్నాయి. మూగ్‌ ఇంక్‌కు భారత్‌లో అనుబంధ సంస్థ అయిన మూగ్‌ మోషన్‌ కంట్రోల్స్‌ ప్రైవేట్స్‌ లిమిటెడ్‌ (ఎంఎంసీపీఎల్‌) ద్వారా హిందుస్థాన్‌ ఏరో నాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌), సౌత్‌ సెంట్రల్‌ రైల్వే రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ (ఆర్‌డీఎ్‌సఓ) అధికారులకు లంచం ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు అక్టోబరు 11న సెక్‌ పేర్కొంది.

ఆగస్టు 2020లో ‘‘ఏజెంట్‌ ఏ’’ని నియమించుకోవడం ద్వారా సౌత్‌ సెంట్రల్‌ రైల్వే టెండర్ల జాబితా కంపెనీల్లో మూగ్‌ చోటు దక్కించుకుందని, ఆ తర్వాత నెలలో 34,323 డాలర్ల విలువైన కాంట్రాక్టు విజేతగా నిలిచిందని సెక్‌ పేర్కొంది. ఈ కాంట్రాక్టులో 10 శాతం కమిషన్‌ మూగ్‌ ఇచ్చినట్లు వెల్లడించింది. ఇక నవంబరు 2021లో హెచ్‌ఏల్‌కు విడిభాగాలు, సేవలు అందించే 13,99,328 డాలర్ల కాంట్రాక్టు దక్కించుకునేందుకు హెచ్‌ఏఎల్‌ అధికారి ఒకరికి 2.5ు కమిషన్‌ ఇచ్చినట్లు సెక్‌ తెలిపింది. హెచ్‌ఏఎల్‌, రైల్వేలకు సుమారు 5 లక్షల డాలర్లు మూగ్‌ లంచం ఇచ్చినట్లు సెక్‌ చెప్పింది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ)తో పాటు ఇండోనేసియా, వియత్నాంలోని కంపెనీల కాంట్రాక్టుల కోసం అల్బెమార్లె కార్పొరేషన్‌ భారీగా ముడుపులు ఇచ్చి దక్కించుకున్నట్లు గతేడాది సెక్‌ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 700కు పైగా కంపెనీలకు రిపైనింగ్‌ సొల్యూషన్స్‌ను అల్బెమార్లే సరఫరా చేస్తోంది. 2009-2017 మధ్య ఐవోసీతో సంబంధాలు నెరిపింది. 2017లో 63.5 మిలియన్ల డాలర్లు లంచం ఇస్తూ అమెరికా అధికారులకు దొరికింది.


ఒరాకిల్‌ కూడా అదే దారిలో

టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ ఇండియాతో పాటు యూఏఈ, తుర్కియేల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లు సెక్‌ తెలిపింది. ఓ ట్రాన్స్‌పోర్టేషన్‌ కంపెనీ నుంచి 2019లో ఒరాకిల్‌ సేల్స్‌ ఉద్యోగులు అధిక రాయితీ పొందారని, ఆ కంపెనీలో ఎక్కువ భాగస్వామ్యం రైల్వేకు ఉందని తెలిపింది. రాష్ట్ర యాజమాన్యంలోని ఓ సంస్థ నిధుల విడుదల విషయంలో 6.8 మిలియన్‌ డాలర్ల ముడుపులు చెల్లించినట్లు వెల్లడించింది.

జరిమానా ఇలా..

హెచ్‌ఏఎల్‌, రైల్వేల్లో 5 లక్షల డాలర్లకుపైగా ముడుపులు ఇస్తూ దొరికిన మూగ్‌ ఇంక్‌కు సెక్‌ 1.68మిలియన్ల డాలర్లకుపైగా ఫైన్‌ వేసింది.

ఇండియన్‌ రైల్వేస్‌, యూఏఈ, తుర్కియేల్లో 6.8 మిలియన్‌ డాలర్లు లంచం ఇచ్చిన ఒరాకిల్‌ కార్పొరేషన్‌కు 23 మిలియన్‌ డాలర్లు పెనాల్టీ విధించి సెక్‌ కేసు సెటిల్‌ చేసింది.

ఐవోసీతో పాటు ఇండోనేసియా, వియత్నాంలో 63.5 మిలియన్‌ డాలర్లకు పైగా లంచాలు ఇచ్చిన అల్బెమార్లె కార్పొరేషన్‌కు 198 మిలియన్‌ డాలర్ల భారీ జరిమానా విధించింది.

Updated Date - Dec 17 , 2024 | 04:16 AM