Share News

Priyanka Gandhi: వయనాడ్‌లో రాష్ట్రేతరులదే హవా!

ABN , Publish Date - Nov 09 , 2024 | 05:32 AM

వయనాడ్‌ ఎంపీ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికలో పోటీ పడుతున్న 16 మంది అభ్యర్థుల్లో ఏకంగా 11 మంది రాష్ట్రేతరులే కావడం విశేషం. వీరిలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు.

Priyanka Gandhi: వయనాడ్‌లో రాష్ట్రేతరులదే హవా!

  • ఉప ఎన్నిక బరిలో 16 మంది అభ్యర్థులు

  • వారిలో 11 మంది బయటి రాష్ట్రాల వారే

  • ఏపీ, తెలంగాణ నుంచీ ఒక్కొక్కరు పోటీ

వయనాడ్‌, నవంబరు 8: వయనాడ్‌ ఎంపీ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఉప ఎన్నికలో పోటీ పడుతున్న 16 మంది అభ్యర్థుల్లో ఏకంగా 11 మంది రాష్ట్రేతరులే కావడం విశేషం. వీరిలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ప్రధాని మోదీ, ఏబీ వాజపేయి, మన్మోహన్‌ సింగ్‌, పీవీ నరసింహారావు సహా ఎందరో అగ్రనేతలపై 200కు పైగా ఎన్నికల్లో పోటీచేసి ‘ఎలక్షన్‌ కింగ్‌’గా పేరొందిన కె.పద్మరాజన్‌(తమిళనాడు) కూడా బరిలో నిలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై పోటీ చేసిన జయేంద్ర కె. రాథోడ్‌(గుజరాత్‌) సైతం పోటీలో ఉన్నారు. వీరితో పాటు నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి షేక్‌ జలీల్‌(ఏపీ), జాతీయ జనసేన పార్టీకి చెందిన దుగ్గిరాల నాగేశ్వరరావు(తెలంగాణ), కిసాన్‌ మజ్దూర్‌ బేరోజ్‌గార్‌ సంఘ్‌కు చెందిన గోపాల్‌ స్వరూప్‌ గాంధీ(యూపీ), బహుజన్‌ ద్రావిడ పార్టీ నుంచి ఎ.సీత(తమిళనాడు) పోటీ చేస్తున్నారు. ఇంకా నూర్‌ ముహమ్మద్‌ (తమిళనాడు), ఇస్మాయిల్‌ జాబీ ఉల్లా (కర్ణాటక), రుక్మిణి (కర్ణాటక) సోన్హు సింగ్‌ యాదవ్‌ (యూపీ) స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇక సీపీఐ నుంచి సత్యన్‌ మోకేరి, బీజేపీ తరఫున నవ్యా హరిదాస్‌ పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్‌. రాజన్‌ ఒక్కరే వయనాడ్‌ నియోజకవర్గానికి చెందినవారు. కాగా, వయనాడ్‌ మాజీ ఎంపీ రాహుల్‌ గాంధీ కూడా స్థానికేతరుడే.


  • ‘జమాతే’ మద్దతుతో ప్రియాంక పోటీ

తిరువనంతపురం, నవంబరు 8: కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వయనాడ్‌లో జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారని కేరళ సీఎం విజయన్‌ ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీ లౌకికవాద ముసుగును పూర్తిగా బట్టబయలు చేశాయని విరుచుకుపడ్డారు. ‘అసలు కాంగ్రెస్‌ వైఖరి ఏమిటి? జమాతే ఇస్లాం గురించి మన దేశానికి తెలియనిది కాదు. ఆ సంస్థ భావజాలం ప్రజాస్వామిక విలువలకు అనుగుణంగా ఉందా?’ అని విజయన్‌ ప్రశ్నించారు.

Updated Date - Nov 09 , 2024 | 05:32 AM